గెలిస్తేనే... సిరీస్‌లో నిలిచేది

9 Dec, 2023 04:15 IST|Sakshi

నేడు ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో భారత్‌ రెండో టి20

రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ గెలవాలన్నా... రేసులో నిలవాలన్నా భారత మహిళల జట్టు ఈ రెండో మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే ఇంకో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ బృందం కీలకమైన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. గతితప్పిన బౌలింగ్‌ను, నిలకడ లోపించిన టాపార్డర్‌ను మెరుగుపర్చుకొని ఇంగ్లండ్‌ను ఓడించాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.

తొలి టి20లో ఓపెనర్‌ షఫాలీ వర్మ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. హిట్టర్లు స్మృతి మంధాన, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ గత మ్యాచ్‌ వైఫల్యాన్ని అధిగమించి తాజాగా ఈ మ్యాచ్‌లో చెలరేగితే భారత బ్యాటింగ్‌ కష్టాలు తీరతాయి. ఎందుకంటే మిడిలార్డర్‌ను కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ ఆదుకోగలదు. జట్టు మేనేజ్‌మెంట్‌ బెంగ ఏదైనా ఉందంటే అది బౌలింగే! సీమర్‌ రేణుక సింగ్‌ మినహా మొత్తం బౌలింగ్‌ విభాగం చేతులెత్తేసింది. దీప్తి శర్మ, పూజ ఒక్క వికెట్‌ తీయకపోగా... పరుగుల్ని అతిగా సమర్పించుకున్నారు.

వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్‌లు కూడా పరుగుల వేగాన్ని అడ్డుకోలేకపోయారు. మరోవైపు తొలిమ్యాచ్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్‌ అమ్మాయిల బృందం వరుస విజయంతో ఏకంగా సిరీస్‌పైనే కన్నేసింది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఇక వేదిక (వాంఖెడె) ఒక్కటే కావడంతో పిచ్‌ గత మ్యాచ్‌కు భిన్నంగా ఉండదు. బ్యాటింగ్‌కు కలిసొచ్చే వికెట్‌ కావడంతో బౌలర్లకు కఠిన పరీక్ష తప్పదు. 

>
మరిన్ని వార్తలు