పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం

16 May, 2016 14:12 IST|Sakshi
పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం  మొదటిసారి పాజిటివ్ గా నమోదైంది. వరుసగా గత 17 నెలలుగా క్షీణతలోనే ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం 18నెలల్లో మొదటిసారి  పెరిగింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్ నెల టోకుధరల ద్రవ్యోల్బణం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 0.34 శాతం పెరిగింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ నెలలో దేశీయ ఆహార ధరల ఇండెక్స్ 4.23 శాతం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. మార్చిలో ఈ ఇండెక్స్ 3.73శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్ లో 0.71 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడయ్యాయి. అయితే ఆయిల్ ధరలు ఏప్రిల్ నెలలో 4.83శాతం పడిపోయాయి.

ద్రవ్యోల్బణాన్ని కొలవడంలో టోకుధరల సూచీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. టోకు అమ్మకాల ఉత్పత్తుల ధరలకనుగుణంగా ఈ గణాంకాలను విడుదల చేస్తారు. భారత్ లో టోకు ధరల సూచీని ముఖ్యంగా మూడు గ్రూపులుగా విభజిస్తారు. ప్రైమరీ ఆర్టికల్స్(మొత్తం కొలమానంలో 20.1శాతం) ఆయిల్, విద్యుత్(14.9శాతం), తయారీ ఉత్పత్తులు(65శాతం).  ప్రైమరీ ఆర్టికల్స్ లో ఆహార ఉత్పత్తులను ప్రధాన వాటిగా గుర్తిస్తారు. ఇవి 14.3శాతం వాటాను కలిగి ఉంటాయి. తయారీ ఉత్పత్తుల గ్రూపులో కెమికల్, కెమికల్ ఉత్పత్తులు 12శాతం వాటాతో ముఖ్యమైనవిగా ఉంటాయి. బేసిక్ మెటల్స్, అలాయ్ అండ్ మెటల్ ఉత్పత్తులు 10.8శాతం, టెక్స్ టైల్స్ 7.3శాతం, రవాణా, పరికరాలు, పార్ట్ లు 5.2శాతం, మిషనరీ, మిషనరీ టూల్స్ 8.9శాతం వాటాను కలిగి ఉంటాయి.

మరిన్ని వార్తలు