ట్రేడింగ్‌పై మోజు, రా..రమ‍్మంటున్న లాభాలు, డీమ్యాట్‌ ఖాతాలు జూమ్‌

26 Sep, 2023 12:49 IST|Sakshi

 ఆగస్టులో 26 శాతం అప్‌ 12.7 కోట్లకు చేరిక 

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్‌ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్‌ఎస్‌డీఎల్‌లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్‌ అకౌంట్లు సీడీఎస్‌ఎల్‌లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్‌ సంస్థలు డీమ్యాట్‌ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్‌పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఈ యాక్టివ్‌ క్లయింట్లకు సంబంధించి టాప్‌ 5 డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సంస్థల (జిరోధా, ఏంజెల్‌ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది.   

మరిన్ని వార్తలు