టోకు ధరలూ మంటే..!

15 Dec, 2017 01:56 IST|Sakshi

నవంబర్‌లో 3.93 శాతం

ఎనిమిది నెలల గరిష్ట స్థాయి

ఉల్లి, కూరగాయల ధరల భారం

న్యూఢిల్లీ: టోకు ధరలు నవంబర్‌లో భగ్గుమన్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 నవంబర్‌ ఉన్న టోకు బాస్కెట్‌ ధరతో పోల్చితే 2017 నవంబర్‌లో టోకు బాస్కెట్‌ ధర 3.93 శాతం పెరిగిందన్నమాట. ఇంత స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి.

ఉల్లిపాయలు, కూరగాయల ధరల భారీ పెరుగుదల దీనికి కారణం. ఇదే ఏడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.59 శాతం కాగా, గత ఏడాది నవంబర్‌లో 1.82 శాతంగా ఉంది. కాగా ఇటీవలే విడుదలైన నవంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయిలో 4.88 శాతంగా నమోదై ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే.  

ఉల్లి ధర 178% అప్‌...: ఉల్లిపాయల ధర 2016 నవంబర్‌తో పోల్చితే 2017 నవంబర్‌లో భారీగా 178% పెరిగింది. అక్టోబర్‌లో 36.61%పెరిగిన కూరగాయల ధరలు నవంబర్‌లో ఏకంగా 59.80% ఎగబాకాయి. గుడ్లు, మాసం, చేపలు మూడింటినీ కలిపి చూస్తే, నవంబర్‌లో ధర 4.73% పెరిగింది.

>
మరిన్ని వార్తలు