మహిళలకు జీవిత బీమా...

6 Apr, 2014 03:38 IST|Sakshi
మహిళలకు జీవిత బీమా...
సంక్షోభ సమయంలో జీవిత బీమా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎలాంటి ఆర్థిక రక్షణ కల్పిస్తుందో పలువురికి తెలుసు. అయితే, తమకు, తమ ఆప్తుల భద్రమైన భవిష్యత్తుకు ఏంచేయాలనే విషయంపై చాలామంది మహిళలకు పెద్దగా అవగాహన లేదు. ఒడిదుడుకుల్లేని భవిత కోసం జీవిత బీమా చేస్తున్న స్త్రీలు తెలుసుకోవాల్సిన ఐదు ప్రశ్నలు, సమాధానాలు ఇవి...
 
 
 జీవిత బీమాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?
 సురక్షిత ఆర్థిక భవిష్యత్తు కోసం చేయాలి. జీవితాంతం అందే ఆదాయం కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత సమకూరుతుంది.
 
 కవరేజీ ఎంత ఉండాలి?
 బీమా చేయించే మహిళ ఆదాయం, ఆమె కుటుంబ సభ్యుల భవిష్యత్ అవసరాల ఆధారంగా బీమా కవరేజీ ఎంత ఉండాలో నిర్ణయించుకోవాలి. ఆమె వార్షిక ఆదాయానికి 8 నుంచి 10 రెట్ల వరకు కవరేజీ ఉండాలనేది సాధారణ నియమం. అందుకు ఎంత ప్రీమియం చెల్లిం చాలి, ప్రస్తుతం ఉన్న రుణాలు ఎన్ని, ఆస్తుల విలువ ఎంత, ఇన్వెస్ట్ చేసే నాటికి ఆమె వయసు, ఆమెకు ఎందరు పిల్లలు, వారి వయసెంత అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని కవరేజీ నిర్ణయించుకోవాలి. తమ కంపెనీ యాజమాన్యం కల్పించే బీమా కవరేజీపైనే చాలా మంది మహిళా ఉద్యోగులు ఆధారపడుతుంటారు. ఇది కరెక్టు కాదు. అనేక కంపెనీలు తమ సిబ్బందికి బీమా కవరేజీ కల్పిస్తుంటాయి. ఆ కంపెనీని వదిలేసిన తర్వాత బీమా కవరేజీ కొనసాగదనే విషయాన్ని చాలా మంది మహిళలు పట్టించుకోరు. ఉద్యోగాల్లో మార్పులు అనూహ్యంగా జరుగుతాయి కాబట్టి సొంతంగా జీవిత బీమా పాలసీ తీసుకోవాలి.
 
 ఏ పాలసీ మంచిది?
 అవసరాలు, ఉద్దేశాలు వ్యక్తికీ, వ్యక్తికీ మారుతుంటాయి కాబట్టి ఆదర్శవంతమైన బీమా పాలసీ అంటూ ఉండదు. దీర్ఘకాలిక ప్లాన్ ఉండడం ప్రతి మహిళకూ అవసరం. జీవితాంతం కవరేజీ ఉండే పాలసీ అయితే తుదివరకూ నిరంతర ఆదాయం ఉంటుంది. ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చే మనీ బ్యాక్ ఆప్షన్, పరిమిత కాలం ప్రీమి యం చెల్లింపు వంటి ప్రయోజనాలు బీమా కవరేజీలో ఉంటాయి. వృద్ధాప్యంలో రుణం తీసుకునే అవకాశం ఉండడం మరో ప్రయోజనం. 
 
 కాలానుగుణంగా సమీక్షించాలా?
 మహిళకు వివాహమైన తర్వాత, లేదా ఆమె పిల్లలు సొంతకాళ్లపై నిలబడినపుడు ఆమె తన పాలసీని మార్చుకోవడం అవసరం. కావాలనుకుంటే లబ్ధిదారును తొలగించవచ్చు లేదా కొత్త లబ్ధిదారును చేర్చవచ్చు. ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేసి భారీ రుణం తీసుకున్నట్లయితే అదనపు కవరేజీ ఉండే కొత్త పాలసీని తీసుకోవాల్సి రావచ్చు. అంటే, బీమాలో పెట్టుబడులను కాలానుగుణంగా సమీక్షించుకోవడం అవసరం.
 
 గృహిణులకూ అవసరమా?
 ఇంటికే పరిమితమయ్యే మహిళలకు జీవిత బీమా అవసరం లేదనేది సాధారణ అభిప్రాయం. ఇది తప్పు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కావాలంటే గృహిణులకూ జీవిత బీమా కల్పించాలి. 
>
మరిన్ని వార్తలు