ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ కిమ్‌ రాజీనామా 

9 Jan, 2019 01:14 IST|Sakshi

ఇంకా మిగిలి ఉన్న పదవీకాలం మూడేళ్లు

ప్రైవేట్‌ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలో చేరిక

వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పదవికి జిమ్‌ యోంగ్‌ కిమ్‌ రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా మూడేళ్లుండగానే ఆయన అర్ధంతరంగా తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రైవేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలో చేరే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పదవికి కిమ్‌(58) రాజీనామా చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొత్త చీఫ్‌ నియమితులయ్యేదాకా వరల్డ్‌ బ్యాంక్‌ సీఈవో క్రిస్టలీనా జార్జియేవా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కిమ్‌ ఆరేళ్లుగా ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పదవిలో కొనసాగుతున్నారు. 2017లో రెండో దఫా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కిమ్‌ పదవీకాలం వాస్తవానికి 2022 నాటికి ముగియాల్సి ఉంది. వాతావరణ మార్పులు, కరువు, కాందిశీకుల సమస్యలు మొదలైనవి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల పేదల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రపంచ బ్యాంక్‌పై ఉందని ఒక ప్రకటనలో కిమ్‌ పేర్కొన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన కిమ్‌.. దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. ముందుగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌లో అడ్వైజర్‌గా చేరి, ఆ తర్వాత వరల్డ్‌ బ్యాంక్‌లో అంచెలంచెలుగా ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగారు.  

కొత్త చీఫ్‌ నియామకం అంశం.. ప్రపంచ బ్యాంక్‌లోని ఇతర సభ్య దేశాలు, అమెరికా మధ్య రగడకు దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ను అమెరికా నామినేట్‌ చేస్తే, దానిలో భాగమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్‌ను యూరప్‌ దేశాలు నామినేట్‌ చేస్తూ వస్తున్నాయి. మిగతా ప్రాంతాల వర్ధమాన దేశాలకు కూడా ఈ ప్రక్రియలో భాగం ఉండాలన్న డిమాండ్‌ నెలకొనడంతో 2012లో కిమ్‌ను ఎంపిక చేయడం ద్వారా పాత సంప్రదాయానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా  ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాధాన్యాన్ని మరింతగా పెంచే ప్రయత్నాల్లో ఉండటం, దీనికి మిగతా దేశాల నుంచి వ్యతిరేకత వస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్‌ కొత్త చీఫ్‌ నియామకంపై వివాదానికి దారితీయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు