భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...

26 Oct, 2023 04:27 IST|Sakshi

ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంపై దృష్టి

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్‌ ఇన్వర్టర్లు, ఎల్‌ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్‌ .. కొత్తగా దేవూ బ్రాండ్‌ కింద ఇంధన, విద్యుత్‌ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉందని కెల్వాన్‌ ఎండీ హెచ్‌ఎస్‌ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్‌ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ చాన్‌ రియు తెలిపారు.

తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్‌ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్‌ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్‌నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్‌ రియు వివరించారు.  

సియెలోతో ఎంట్రీ..
1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్‌ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్‌ మోటర్స్‌ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్‌ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు