సెంట్రల్ బ్యాంకుల నుంచి ఎక్కువ ఆశించొద్దు: రాజన్

4 Jul, 2016 01:42 IST|Sakshi
సెంట్రల్ బ్యాంకుల నుంచి ఎక్కువ ఆశించొద్దు: రాజన్

బాసెల్ (స్విట్జర్లాండ్): సెంట్రల్ బ్యాంకుల నుంచి మరీ ఎక్కువగా ఆశించడం సరికాదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. సెంట్రల్ బ్యాంకులు సైతం తమ అమ్ములపొదిలో ఇంకా ఆయుధాలున్నాయంటూ పేర్కొనడాన్ని ఆయన తప్పు బట్టారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ప్యానల్ చర్చా కార్యక్రమంలో రాజన్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం విషయంలో సెంట్రల్ బ్యాంకులు నేర్చుకున్న అనుభవాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ...

అభివృద్ధి చెందిన దేశాలు సంప్రదాయ విధానాలను విడిచిపెట్టి.. అదే సమయంలో వర్థమాన దేశాలు మాత్రం పరపతి విధానం, ఆర్థిక విధానాల విషయంలో సంప్రదాయంగానే కొనసాగాలని కోరుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలు ఫలితాలు ఇవ్వని పరిస్థితిలో అభివృద్ధి చెందిన దేశాలు పడిపోయాయని చెప్పుకొచ్చారు. ‘సంప్రదాయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవడం మంచిదే. కానీ ప్రస్తుతమున్న వాతావరణంలో ఇది అంతగా ఆచరణయోగ్యం కాదు. కనుక కొత్త పరిష్కారాలతో ముందుకు రావాలి.  వాతావరణం ఎంతో  మారింది కానీ, ఆర్థికపరమైన వాతావరణం కాదు’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు