సేవింగ్స్‌ వడ్డీలపై యస్‌ బ్యాంకు కోత

16 Aug, 2017 20:25 IST|Sakshi
సేవింగ్స్‌ వడ్డీలపై యస్‌ బ్యాంకు కోత
ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌ బ్యాంకు సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీరేట్లకు కోత పెట్టింది. కోటి రూపాయలు, ఆపై ఉన్న మొత్తాలపై వార్షిక వడ్డీరేట్లకు 25 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టి 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. అదేవిధంగా లక్ష రూపాయల కన్నా తక్కువున్న వాటిపై 100 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో ఈ వడ్డీరేట్లు 5 శాతానికి దిగొచ్చాయి. లక్ష రూపాయల నుంచి కోటి లోపు ఉన్న మొత్తాలకు వడ్డీరేటును 6 శాతంగా ఉంచింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని యస్‌ బ్యాంకు చెప్పింది.
 
కాగ, ఈ నెల మొదట్లోనే ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ కూడా తమ సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. కోటి లోపు ఉన్న నగదు నిల్వలపై వడ్డీరేట్ను అరశాతం తగ్గించి 3.5శాతంగా నిర్ణయించింది. ప్రైవేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు కూడా 50 లక్షల కన్నా తక్కువున్న సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీరేటును మాత్రమే చెల్లించనున్నట్టు ప్రకటించింది. కర్నాటక బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడాలు కూడా తమ సేవింగ్స్‌ అకౌంట్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి.   
మరిన్ని వార్తలు