వాట్సాప్‌లో సీఎంకు బెదిరింపులు

16 Aug, 2017 19:36 IST|Sakshi
వాట్సాప్‌లో సీఎంకు బెదిరింపులు

వేలూరు: పాలారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రిని, కలెక్టర్‌ను బెదిరిస్తూ వాట్సాప్‌లో పోస్ట్‌ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేలూరు జిల్లా వాలాజ సమీపంలోని తిరుమలచ్చేరి గ్రామానికి చెందిన విఘ్నేష్‌(31) ఎమ్మెస్సీ వరకు చదువుకుని ఖాళీగా ఉంటున్నాడు. వాలాజ వీసీ మోటూరు, రాణిపేట, ఆర్కాడు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం, ఎస్‌పీ కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయంలో విఘ్నేష్‌ తరచూ ఫిర్యాదులు అందజేసేవాడు.

ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్బ జలాలు అడుగంటి పోయి ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారంటూ, దానిని అరికట్టాలని కోరేవాడు. అయితే, అతడి ఫిర్యాదులకు అధికారులు స్పందించకపోవటంతో విఘ్నేష్‌ అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన సెల్‌ వాట్సాప్‌లో ఇసుక రవాణాను అరికట్టటానికి సీఎం పళనిస్వామి, కలెక్టర్‌ రామన్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ బెదిరింపులు స్పురించేలా మాట్లాడి తన మిత్రులకు పోస్ట్‌ చేశాడు. వీటిపై వీఏవో సంపత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు విఘ్నేష్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు