‘కాట్టేరి’కి శ్రీకారం చుట్టారు

13 Dec, 2017 19:36 IST|Sakshi

కాట్టేరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. సూర్య కథానాయకుడిగా తానాసేర్న్‌ద కూట్టం, ఆర్య హీరోగా గజనీకాంత్‌ చిత్రాలను నిర్మిస్తున్న స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం కాట్టేరి. వైభవ్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కరుణాకరన్, మొట్టై రాజేంద్రన్, పొన్నంబళం, యూట్యూబ్‌ ఫేమ్‌ సారా ముఖ్యపాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను డీకే నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు యామిరుక్క భయమే వంటి కామెడీ హర్రర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో కూడిన సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని కూడా అదే బ్యానర్‌లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంగీతాన్ని ప్రసాద్, ఛాయాగ్రహణం విక్కీ అందిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం ఈ చిత్రం ప్రారంభమైంది. చెన్నైలోని స్టూడియో గ్రీన్‌ సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా పారంభమైన ఈ కార్యక్రమానికి దర్శకుడు కేవీ.ఆనంద్, పుష్కర్‌ గాయత్రి ద్వయం, ఆధిక్‌ రవిచంద్రన్, నటుడు జీవా, చిత్ర హీరో వైభవ్, కరుణాకరన్, మొట్ట రాజేంద్రన్, సీవీ.కుమార్, శక్తివేలన్, నటి వీజే.రమ్య, నాక్‌ స్టూడియోస్‌ అరుణ్‌ పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో వైభవ్‌కు జంటగా ఓ ప్రముఖ నటి కోసం చర్చలు జరుగుతున్నాయని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సంస్థలో సూర్య హీరోగా నిర్మాణం అవుతున్న తానాసేర్న్‌ద కూట్టం చిత్రం చిత్రీకరణను పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటూ జనవరిలో పొంగల్‌ సంబరాలకు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. 

Read latest Celebrities News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా