జగన్‌ పాదయాత్రలో ఎన్నారై దంపతులు

10 Jan, 2018 12:57 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో తాము సైతం అంటూ ఓ ఎన్నారై జంట పాల్గొంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో  బుధవారం జగన్‌తో కలిసి ఎన్నారై దంపతులు అడుగులు కలిపారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లెకు చెందిన హరిప్రసాద్‌, సరిత దంపతులు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని తమ అభిమానం చాటుకున్నారు. 

ఈ సందర్భంగా ఎన్నారై దంపతులు మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలకు మరింతగా చేరువ అవుతున్నారన్నారు. దీనివల్ల వైఎస్‌ జగన్‌ సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఏ రాజకీయ నాయకుడికి, సినిమా యాక్టర్‌కు లేని ప్రజాదరణ వైఎస్‌ జగన్‌కు ఉందన్నారు. అభిమానం అనేది మనసులో నుంచి రావాలని, అది తాము ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. ఆయన పాదయాత్ర ద్వారా రెండు కోట్ల మందిని కలవడం సంతోషకరమన్నారు. 

ప్రజలు ఆయనను దగ్గర నుంచి చూస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించే వ్యక్తి వైఎస్‌ జగనే అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ నాయకత్వం ఎంతైనా అవసరం అని ఎన్నారై దంపతులు అన్నారు. యూఎస్‌లో కూడా చాలామంది వచ్చి మమ్మల్ని కలుస్తుంటారని, వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న పట్టు మరే పార్టీకి లేదన్నారు. ఏపీలో ఎటు చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌ మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారని హరిప్రసాద్‌ దంపతులు తెలిపారు.

మరిన్ని వార్తలు