టీటీడీ బోర్డు కోసం.. బీజేపీ వర్సెస్‌ టీడీపీ

20 Jan, 2018 12:47 IST|Sakshi

సీఎం ప్రకటనతో చిగురించిన ఆశలు

చైర్మన్‌ పదవి కోసం ఆ నలుగురి పైరవీలు

పాలక మండలిలో చోటు కోసం పోటాపోటీ

ముగ్గురికి చోటు కల్పించాలంటూ బీజేపీ పట్టు

ఒకరికే ఎక్కువ అంటూ టీడీపీ ముఖ్యుల సెటైర్లు

బోర్డు ఆలస్యం కావడానికి బీజేపీనే కారణమంటున్న టీడీపీ

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కోసం బీజేపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందువల్లే ఇన్నాళ్లు టీటీడీ పాలకమండలి ఏర్పాటు కాలేదని విశ్వసనీయ సమాచారం. బీజేపీ, టీడీపీ అధిష్ఠానాల మధ్య చర్చలు కొలిక్కిరావడంతో త్వరలోనే పాలక మండలి ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు నారావారిపల్లెలో ప్రకటించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు పాలకమండలిలో చోటుకోసం పోటీ పడుతున్నారు. బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. 

కొన్నాళ్ల పాటు రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నా తరువాత దూరం పెరిగింది. మనస్పర్ధలు లేనన్ని రోజులు టీటీడీ పాలకమండలిలో బీజేపీ వేలు పెట్టలేదు. టీడీపీ నేతలు బీజేపీని దూరం పెట్టినప్పటి నుంచి టీటీడీ పాలకమండలి ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే పాలకమండలిని ప్రకటించింది. అది కూడా మొదటి సారి ఎంపిక చేసిన పాలక మండలినే రెండవ సారి కూడా కొనసాగించాల్సి వచ్చింది. కొత్తగా చైర్మన్, సభ్యులను ఏర్పాటు చేసే సాహసం చేయలేకపోయింది. పాలకమండలి పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదు.

బోర్డులో ప్రాధాన్యత కోసం బీజేపీ పట్టు
టీటీడీ పాలకమండలిలో తమకు ప్రాధాన్యం ఉండాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. గత పాలకమండలిలో బీజేపీ నుంచి భానుప్రకాష్‌రెడ్డికి మాత్రం అవకాశం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఈ సారి ఐదుగురికి అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని హెచ్చరించనిట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు టీడీపీ అధిష్టానం ససేమిరా అనడంతో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. మండలిలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని బీజేపీ అధిష్టానం గట్టిగా చెప్పినట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య నెలకొన్న వివాదంతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయడానికి టీడీపీ ప్రభుత్వం సాహసించలేదు. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లిన సమయంలో పాలక మండలి విషయంపైనా బీజేపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అందులో భాగంగానే మంగళవారం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే పాలకమండలి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

పోటా పోటీ
సీఎం ప్రకటనతో పాలక మండలి చైర్మన్, బోర్డు మెంబర్ల కోసం పలువురు బీజేపీ, టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. చైర్మన్‌ పదవి కోసం వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్, నెల్లూరు నుంచి బీదా మస్తాన్‌రావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌తో పాటు తాజాగా సినీ దర్శకులు రాఘవేంద్రరావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బోర్డు మెంబర్‌ కోసం టీడీపీ జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ లేదా ఆయన తండ్రి ఎన్టీఆర్‌ రాజు పేరు ముందు వరుసలో ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నారనే కారణంతో ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే నీలం బాలాజి, డాక్టర్‌ సుధారాణి, మందలపు మోహన్‌రావు కూడా బోర్డులో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

మందలపు మోహన్‌రావు 2004లో కాంగ్రెస్‌లో చేరి తిరిగి 2009లో టీడీపీలో చేరారు. దీంతో మందలపు మోహన్‌రావుకి బోర్డులో అవకాశం ఇచ్చే అవకాశం లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన ముగ్గురిలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. బీజేపీ నుంచి భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్, చల్లపల్లి నరసింహారెడ్డి, తెలంగాణ, తమిళనాడుకు చెందిన మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు.

అందులో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా భానుప్రకాష్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ద్వారా కోలా ఆనంద్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కోరినట్లు ఐదుగురికి బోర్డు మెంబర్లుగా ఇస్తే తమ పరిస్థితి ఏమిటని టీడీపీ ముఖ్య నేతలు అధినాయకుడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి కూడా ఒకరికి అవకాశం కల్పిస్తే సరిపోతుందని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాలకమండలిని ఏర్పాటు చేస్తారా? ఎందుకీ తలనొప్పులని గతంలోలా వాయిదా వేస్తారా? అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు