గౌతమి తల్లిదండ్రులకు వైఎస్‌ జగన్‌ భరోసా

18 Jan, 2018 13:38 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని ఆయన మండిపడ్డారు. రేణిగుంట మండలం పరకాల గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి గౌతమి  క్యాన్సర్‌ కారణంగా కంటి చూపు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిశారు.

తమ బిడ్డ క్యాన్సర్‌ కారణంగా కంటి చూపు కోల్పోయిందని, ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికే వైద్యం కోసం మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లో రూ.5 లక్షలు ఖర్చు చేశామని, ఇక వైద్యం చేయించేందుకు తమకు స్థోమత లేదని ఆవేదన చెందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఇటువంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసేవారని,  ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా చికిత్సకు ఆలస్యం చేస్తే మరో కంటికి కూడా చూపు పోయే ప్రమాదం ఉందని వారు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

గౌతమి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్నవైఎస్‌ జగన్‌ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చిన్నారులకు కాంక్లీయర్‌ ఇన్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి వ్యాధులకు వైద్యం అందించడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తామని, ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తామని ఆయన జగన్‌ పేర్కొన్నారు. జననేత హామీతో గౌతమి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు