ఐదో వన్డే: మెరిసిన ఖవాజా.. మురిసిన ఆసీస్‌

13 Mar, 2019 15:19 IST|Sakshi
సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా

సెంచరీతో ఆకట్టుకున్న ఖవాజా

మూడు వికెట్లతో రాణించిన భువనేశ్వర్‌

రెండేసి వికెట్లు పడగొట్టిన జడేజా, షమీ

న్యూఢిల్లీ: చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించారు. సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కంగారూ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడి జోరుకు 30 ఓవర్ల వరకూ ఆసీస్‌ స్కోరు బోర్డు జెట్‌ స్పీడుతో దూసుకెళ్లింది. అతడికి తోడుగా మరో ఓపెనర్‌ ఫించ్‌ (27 పరుగులు), హ్యాండ్స్‌కోంబ్‌ (52 పరుగులు) రాణించడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేయగలిగింది.

32వ ఓవర్లో ఖవాజా ఔటైన తర్వాత ఆసీస్‌ స్కోరుకు బ్రేక్‌ పడింది. భారత బౌలర్లు చక్కని లైన్‌ అండ్‌ లైంగ్త్‌తో కూడిన పదునైన బంతులేసి కంగారూ బ్యాటర్ల పని పట్టారు. దాంతో 50 బంతుల వ్యవధిలో నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నాలుగో వన్డే హీరో టర్నర్‌కు తోడుగా చివరి వరస బ్యాట్స్‌మెన్‌ రిచర్డ్‌సన్‌, కమిన్స్‌ల రాణింపుతో ఆస్ట్రేలియా జట్టు 272 పరుగులు చేయగలిగింది.

టీమిండియా బౌలర్లు చివరి 20 ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. భారత్‌ లక్ష్యం 273 పరుగులు. భారత బ్యాట్స్‌మెన్లు రాణిస్తే ఈ స్కోరును ఛేదించడం కష్టం కాకపోవచ్చు. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన ధావన్‌, మరో ఓపెనర్‌ రోహిత్‌లు కలసి శుభారంభాన్ని ఇవ్వాల్సి ఉంది. ఛేదనలో అదరగొట్టే కోహ్లీ ఉండనే ఉన్నాడు. వీరికి జతగా ఆల్‌రౌండర్లు జడేజా, విజయ్‌ శంకర్‌, హిట్టర్‌ రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌లు రాణిస్తే ఛేదన సులువవుతుంది.

మరిన్ని వార్తలు