విమానంలో విషాదం

16 Nov, 2019 11:31 IST|Sakshi

ముంబై : విమానంలో ప్రయాణిస్తున్న నెలలు నిండని ఓ చిన్నారి దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే మరణించింది. బిడ్డ పడుకుందని భావించిన ఆ తల్లి కూతురు శాశ్వత నిద్రలోకి వెళ్లిందని గమనించలేకపోయింది. ఈ హృదయ విదారకర ఘటన శుక్రవారం మహరాష్టలో చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి రియా.. తల్లి ప్రీతి జిందల్‌, అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జైపూర్‌ నుంచి ముంబై వస్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణిస్తుంది. వీరు సూరత్‌లో విమానం ఎక్కగా.. ముంబైలో విమానం దిగే సరికి చిన్నారి నుంచి ఎలాంటి అలికిడి, స్పందన లేకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ముంబై విమానాశ్రయంలో దిగగానే విమాన సిబ్బందికి తెలియజేసి వైద్య సహాయాన్ని కోరారు. 

వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది హుటాహుటిన చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మరణించిందని ధ్రువీకరించడంలో ఆ తల్లి ఆర్తనాదాలు మిన్నంటాయి. విమానం ఎక్కే సమయంలో కూతురు బాగానే ఉందని, అంతకముందే పాపకు పాలు తాగించానని, తరువాత పడుకోవడంతో నిద్రలోకి వెళ్లిందనుకున్నానని తల్లి కన్నీరు మున్నీరవడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఇక శిశువు మృతికి కారణాలు వెల్లడి కాలేదు. శిశువు మృతదేహానికి పోస్టుమార్టం చేసినా కారణాలు తెలియ​కపోవడంతో శరీరం నుంచి నమూనాలను సేకరించి ఆసుపత్రికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని సంబంధిత విమాన అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు