విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాద ఘటనలో కీలక ఆధారాలు

25 Nov, 2023 14:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో విశాఖ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. కీలక ఆధారమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి సారించారు.

ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:49 నిమిషాలకు ఇద్దరు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారని, 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

కొంప ముంచిన ఉప్పు చేప
ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం అదేబోటులో పనిచేసిన నాని మామ సత్యం.. మద్యం మత్తులో మంచింగ్‌ కోసం ఉప్పు చేప ఫ్రై చేశాడు. దీంతో మంటలు చెలరేగాయి. 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి నిందితులు కారణమయ్యారు.

వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణం: సీపీ
ఈ కేసుపై సీపీ రవిశంకర్‌ మీడియాకు వివరించారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణమని పేర్కొన్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి ఫిషింగ్‌ హార్బర్‌కు వచ్చారు. అల్లిపల్లి వేంకటేష్‌కు చెందిన 887 నంబర్‌ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకుని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరెట్‌ తాగి పక్కన ఉన్న 815 నెంబర్ బోటుపై పడేశారు. దీంతో మంటలు చెలరేగి వ్యాపించడంతో గమనించి మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.

వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామని.. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానతులను విచారించామని సీపీ పేర్కొన్నారు. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. విచారణలో భాగంగానే యూట్యూబర్‌ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని సీపీ తెలిపారు.

చదవండి: చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్‌ చేసింది!

మరిన్ని వార్తలు