ఏసీబీ వలలో భీమవరం వీఆర్వో

18 Oct, 2017 12:38 IST|Sakshi
మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌,పట్టుబడిన వీఆర్వో సరోజని

ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో

రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

కార్యాలయంలో బయటపడిన 250 ఈ పాసుపుస్తకాలు

ముండ్లమూరు: ఓ రైతు వద్ద లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... మండలంలోని భీమవరం రెవెన్యూ పరిధిలో గల కొమ్మవరం గ్రామానికి చెందిన రైతు కంచర్ల వీరాంజనేయులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం గత ఆగస్టులో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో భీమవరం వీఆర్వో సరోజని అతడికి ఫోన్‌ చేసి పిలిపించి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలంటే కొంత నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. దీంతో చేసేది లేక రూ.3 వేలను రైతు వీరాంజనేయులు వీఆర్వోకి ఇచ్చాడు. అనంతరం సెప్టెంబర్‌ 5వ తేదీ ఈ పాస్‌పుస్తకాలు మంజూరైనట్లు అతడి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో వెంటనే వీఆర్వోని కలవగా, ఒక్కొక్క పాసుపుస్తకానికి రూ.2 వేల చొప్పున మూడింటికి రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

తన వద్ద అంత డబ్బు లేదని వీరాంజనేయులు ప్రాధేయపడినా.. ససేమిరా అంది. రూ.6 వేలు ఇస్తేనే పాసుపుస్తకాలు ఇస్తానని, లేకుంటే లేదని తేల్చి చెప్పింది. దీంతో కడుపుమండిన ఆ రైతు.. పదిరోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ ఆధ్వర్యంలో రచించిన ప్రణాళిక ప్రకారం.. మంగళవారం వీరాంజనేయులు రూ.6 వేలను వీఆర్వో సరోజనికి ఇస్తుండగా, ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వీఆర్వో వద్ద ఉన్న 30 పాసుపుస్తకాలను కూడా ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, అధికారులు స్వాధీనం చేసుకుని రైతులÆకు ఇవ్వాలని తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బీరువాలో దాచి ఉంచిన 250 ఈ పాసుపుస్తకాలను కూడా గమనించి వారం రోజుల్లో సంబంధిత రైతులకు వాటిని పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు ఆదేశించారు. పట్టుబడిన వీఆర్వోను విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ప్రతాప్‌కుమార్, సంజీవకుమార్, ఎస్సై కరిముల్లా, సిబ్బంది పాల్గొన్నారు.

లంచాల కోసం పీడిస్తే సహించేది లేదు – ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకరరావు
అధికారులు, సిబ్బంది లంచాల కోసం ప్రజలను పీడిస్తే సహించేది లేదని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ హెచ్చరించారు. భీమవరం వీఆర్వో సరోజనిని పట్టుకున్న అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. రెవెన్యూ అధికారులు లంచాల కోసం రైతులను ఇబ్బంది పెడితే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు.

గత్యంతరం లేకనే ఏసీబీని ఆశ్రయించాను
మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన 12 ఎకరాల పొలాన్ని మా ముగ్గురు అన్నదమ్ములం సమానంగా నాలుగు ఎకరాల చొప్పున పంచుకున్నాం. వాటికి సంబంధించిన పాస్‌పుస్తకాల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోగా, వీఆర్వో సరోజని లంచం డిమాండ్‌ చేసింది. అంత మొత్తం ఇచ్చుకోలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.
– కంచర్ల వీరాంజనేయులు, బాధిత రైతు

మరిన్ని వార్తలు