కల్తీ మద్యం కలకలం

3 May, 2018 13:40 IST|Sakshi
ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న కల్తీ మద్యం    

మందస : జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న కల్తీ మద్యం వ్యవహారం మందస మండలంలోనూ వెలుగు చూసింది. మండలంలోని హరిపురం–బాలిగాం జంక్షన్‌లోని ఓ వైన్‌షాపులో మద్యాన్ని కల్తీ చేస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హరిపురం–బాలిగాం జంక్షన్‌లోని తనీష్‌ వైన్స్‌(జీఎస్‌ఎల్‌ నెం.222)లో బుధవారం ఉదయం ఇంపీరియల్‌ బ్లూ క్వార్టర్‌(నిప్‌) బాటిళ్లును కల్తీ చేస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

ఇందులో మొత్తం 5 కేసులు(240 బాటిళ్లు) కల్తీ చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కల్తీకి వినియోగించే కప్పులు తొలగించే మిషన్, రబ్బర్‌ ట్యూబ్‌ తదితర వస్తువులను, 18.6 కేటీఏ లూజ్‌ లిక్కర్‌ మినరల్‌ వాటర్‌ బాటిళ్లలో ఉండగా సీజ్‌ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఏఈఎస్‌ బి.శ్రీనివాసులు, సీఐ ఎస్‌.శ్రీనివాసరావు, ఎస్‌ఐ చంద్రశేఖరరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.

కల్తీ మద్యం వ్యవహారంలో హెచ్‌.వెంకటేశ్‌ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, వైన్‌షాపు నౌకరీనామాలు షణ్ముఖరావు అలియాస్‌ చిన్న, హేమంత్‌కుమార్‌ పేరున ఉన్నాయని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసును సోంపేట ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌కు అప్పగించామని, సోంపేట సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని సోంపేట సీఐ అబ్దుల్‌ఖలీం తెలిపారు. తనీష్‌ వైన్‌ షాపును కూడా సీజ్‌ చేస్తున్నామన్నారు.   

మరిన్ని వార్తలు