ఒత్తిడితో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి

14 Dec, 2017 04:02 IST|Sakshi

ఆత్మకూరు: అగ్రిగోల్డ్‌ సంస్థలో సుమారు రూ.1.50 కోట్లు డిపాజిట్‌ చేయించిన ఓ ఏజెంట్‌.. ఆ కంపెనీ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలై మృతిచెందాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేరారెడ్డిపల్లి బీసీ కాలనీకి చెందిన వల్లెపు వెంకటరమణ (47) అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా ఉంటూ ఆ కంపెనీకి చెందిన నెల్లూరు, ఆత్మకూరు కార్యాలయాల్లో డిపాజిట్లు కట్టించాడు. ఆ కంపెనీ చేతులెత్తేయడంతో సొమ్ము కోసం అతడిపై డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరిగింది. చెల్లింపుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతుండటంతో ఒత్తిడికి గురయ్యాడు. వారం క్రితం అనారోగ్యం పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వెంకటరమణకు భార్య రత్నమ్మ, పదేళ్ల కుమారుడు ఉన్నారు. 

రక్షణ కల్పించండి: ఏజెంట్లు
వెంకటరమణ మృతి చెందడంతో అగ్రి గోల్డ్‌ ఏజెంట్లు ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. అగ్రి గోల్డ్‌ సంస్థను నమ్మి కోట్లాది రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసి వివిధ పథకాల్లో డిపాజిట్లు చేయించామని చెప్పారు. ఆ సంస్థ చేతులెత్తేసిందని, సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోవడంతో డిపాజిటర్ల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఐ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు