ఆర్కెస్ట్రా నిర్వాహకుడి దారుణ హత్య

4 Jun, 2019 13:02 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ షేక్‌ బిలాలుద్దీన్‌

ఆరుబయట నిద్రిస్తుండగా కత్తులతో దాడి

పాత కక్షలే హత్యకు కారణం

నరసరావుపేట టౌన్‌: ఆర్కెస్ట్రా నిర్వాహకుడు దారుణహత్యకు గురైన ఘటన ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాంపురానికి చెందిన గడ్డం బాజి(39) వరవకట్ట వద్ద సోని ఆర్కెస్ట్రా నిర్వహిస్తుంటాడు. మొదటి భార్య విడిచి వెళ్లడంతో రమాదేవి అనే మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. రమాదేవి కుమార్తె విజయలక్ష్మీకి క్రిస్టియన్‌ పాలేనికి చెందిన చల్లా సురేష్‌కు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటంతో విషయం తెలుసుకున్న బాజి ఇద్దరినీ మందలించాడు. అయిన వినకుండా యువతి వెంట పడుతుండటంతో సురేష్‌ను ఇటీవల బాజీ బెదిరించాడు. దీంతో పాటు గతంలో ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఘర్షణలో సురేష్‌తో పాటు అతని స్నేహితులు గోరంట్ల వీరేంద్రనాథ్, చాకలి ఏడుకొండలు, ఉదయగిరి కృష్ణాలు ముద్దాయిలుగా ఉన్నారు. ఆ కేసులో వీరికి వ్యతిరేకంగా బాజీ సాక్ష్యం చెప్పాడు. దీనిపై కక్ష పెంచుకున్న నలుగురు బాజీని ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్నారు. ఇంటి ఆరుబయట బాజీ నిద్రిస్తుండటాన్ని గమనించి హత్యకు వ్యూహ రచన చేశారు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి కూడా ఆరుబయట బాజి నిద్రిస్తుండగా అర్ధరాత్రి వచ్చిన పై నలుగురు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున అటుగా వెళుతున్న పాదచారులు మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న బాజీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ షేక్‌ బిలాలుద్దీన్‌ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితులు
హత్య జరిగిన వెంటనే వన్‌టౌన్‌ పోలీసులు స్పందించటంతో గంటల వ్యవధిలో నిందితుల్ని పట్టుకోగలిగారు. ఘటన స్థలానికి చేరుకొన్న సీఐ బిలాలుద్దీన్‌ సత్వరమే అక్కడకు   పోలీస్‌ జాగిలాలను రప్పించారు. అవి వాసన పసిగడుతూ నిందితులు ఉన్న సమీప ప్రాంతానికి తీసుకువెళ్లాయి. ఆ సమీపంలో గాలించగా మొదట ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారిని విచారించి హత్యతో సంబందం ఉన్న మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు