వీసా దొరక్కే వేషం

17 Sep, 2019 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ: జయేష్‌ పటేల్‌(32) అనే యువకుడు ఓ వృద్ధుడి వేషంలో అమెరికాకు వెళుతూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టవడం తెల్సిందే. పోలీసు విచారణలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అతడు అమెరికాలో ఉద్యోగం పొందేందుకు జయేష్‌ పలుమార్లు ప్రయత్నించినా వీసా దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న భరత్‌ అనే యువకుడు రూ.30 లక్షలు ఖర్చుపెడితే అమెరికాకు వెళ్లొచ్చని చెప్పాడు. ఇందుకు జయేష్‌ అంగీకరించడంతో కొందరు ఏజెంట్లు అతడిని పటేల్‌ నగర్‌లోని ఓ సెలూన్‌కు తీసుకెళ్లారు. దాని యజమాని షంషేర్‌ తన మేకప్‌ మాయాజాలం ప్రదర్శించి 32 ఏళ్ల జయేష్‌ను 81 సంవత్సరాల వృద్ధుడిగా మార్చేశాడు. తలకు పాగాతో పాటు పాత కళ్లద్దాలను అమర్చాడు.

మరోవైపు ఏజెంట్లు అర్మిక్‌ సింగ్‌ పేరుతో జయేష్‌కు నకిలీ పాస్‌పోర్టును అందజేశారు. ఈ వేషంలో తొలుత చెకింగ్‌ను సులభంగా దాటేసిన జయేష్, తన స్వరం వయసుకు తగ్గట్లు లేకపోవడం, ఒంటిపై ముడతలుండకపోవడంతో... సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల కళ్లలోకి సూటిగా చూడకుండా మాట్లాడటంతో దొరికిపోయాడు. షంషేర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. (చదవండి: నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!)

మరిన్ని వార్తలు