టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిపై దాడి

21 May, 2019 12:02 IST|Sakshi
దేవరకద్ర పీఎస్‌లో ఫిర్యాదు చేస్తున్న శ్రీకాంత్‌యాదవ్‌

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

పోలీసులకు ఫిర్యాదు

దేవరకద్ర: దేవరకద్ర టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్‌పై సోమవారం ఉదయం మరో సారి దాడి జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సీఐ పాండురంగారెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. దేవరకద్రలో నివాసం ఉండే శ్రీకాంత్‌యాదవ్‌ ప్రతి సోమవారం పశువుల సంత సమీపంలో ఉన్న ఈశ్వర వీరప్పయ్యస్వామి దేవాలయాలను దర్శించుకోవడం అలవాటు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తుండగా అక్కడ పని చేసే వరుసకు బావ అయిన కుర్వ ఆంజనేయులుతో గొడవ జరిగింది.

ఉద్యోగానికి అడ్డుపడుతున్నావంటూ..
40ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నా తన ఉద్యోగం పర్మినెంట్‌ కాకపోవడానికి కారణం నువ్వే అంటూ శ్రీకాంత్‌యాదవ్‌ను ఆంజనేయులు దూషించాడు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలో ఆంజనేయులు భార్య జయమ్మ, కుమారులు అనిల్‌ కొడవళి చేత పట్టుకుని రాగా మరో ఇద్దరు సోదరులు అక్కడికి వచ్చి శ్రీకాంత్‌యాదవ్‌పై దాడికి ప్రయత్నించారు. దీంతో దేవాలయానికి వచ్చిన అన్న కుమారుడు తోడు కావడంతో శ్రీకాంత్‌యాదవ్‌ తప్పించుకుని దేవాలయంలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌యాదవ్‌కు రక్షణగా నిలిచాడు. ఇంతలో సమాచారం అందిన పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కొడవళి పట్టుకొని వచ్చిన అనిల్‌ పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి శ్రీకాంత్‌యాదవ్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు.

గతంలో జీపుతో ఢీకొట్టి..
కొన్ని నెలల క్రితం శ్రీకాంత్‌యాదవ్‌ను జీపుతో ఢీకొట్టి హత్య చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కాగా ప్రస్తుతం తన బంధువుల నుంచే మరో సారి దాడి జరిగింది. తనను హత్య చేయడానికి జరిపిన దాడి అని శ్రీకాంత్‌ యాదవ్‌ విలేకర్లకు తెలిపారు. గతంలో జరిగిన దాడితో సంబంధాలు ఉన్న వారికి ఈ దాడికి సంబంధం ఉందని తెలిపారు. చట్టపరంగా వారిపై చర్య తీసుకోవాలని కోరారు. కాగా జరిగిన సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాండురంగారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు