సైబర్‌ నేరాల్లో మరో ఎత్తుగడ

19 Oct, 2017 09:55 IST|Sakshi

ఏడాదిపాటు ఉచిత 4జీ డేటా అంటూ మోసం

సాక్షి, హైదరాబాద్‌: ఏమాత్రం అవకాశం దొరికినా సైబర్‌ నేరగాళ్లు అమాయకుల చెవిలో పూలు పెడుతున్నారు. ఏదో లక్కీ డ్రా గెలుచుకున్నారంటూ మోసం చేస్తారు. మిమ్మల్ని బుట్టలో పడేసి కార్డు, బ్యాంకు వివరాలు తెలుసుకుంటారు. ఆ తరువాత ఖాతాలు ఖాళీ చేస్తారు. ఇప్పుడు తాజాగా మరో పద్దతి ఎన్నుకున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఉచితంగా 3జీ, 4జీ డేటా ప్యాక్‌ ఉచితం అంటూ మోసం చేస్తున్నారు. ఓ వెబ్‌సైట్‌ లింకును షేర్‌ చేస్తే మీకు ఏడాది పాటు ఉచితడేటా అంటూ మీ వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం సేకరించిన వివరాలను సైబర్‌ నేరగాళ్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.  

వివరాల్లోకి వెళ్తే తాజాగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ గ్రూప్‌ల్లో ఓ మెస్సేజ్‌ వైరల్‌ అవుతోంది. షేర్‌ చేస్తే ఏడాదిపాటు 3జీలేదా 4జీ ఉచిత డేటా అంటూ ఓవెబ్‌సైట్‌ లింక్‌ షేర్‌ అవుతోంది. ఈ లింక్‌ ఓపెన్‌ చేయగానే ఇందులో మూడు స్టేజ్‌లు చూపిస్తుంది. మొదటిది మీ వివరాలు నింపాలి. రెండో స్టేజ్‌లో ఫేస్‌బుక్‌ లేదా వాట్సప్‌లో షేర్‌ చేయమని అడుగుతుంది. ఆతర్వాత మూడో స్టేజ్‌లో 30 నిమిశాల్లో రీచార్జ్‌ వస్తుందని ఉంటుంది. అయితే ఉచిత డేటాకు ఆశపడి చాలా మంది ఈ లింక్‌ను తమ గ్రూపుల్లో విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అదొక నకిలీ వెబ్‌సైట్‌. మీరు వివరాలు నమోదు చేయగానే ఆడేటా మొత్తం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. అంతేకాకుండా టెలీ మార్ఫింగ్‌ ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైన అనుమానం ఉంటే సంబంధిత ఆపరేటర్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తారు.

ఒక వేళ సదరు ఆపరేటర్‌ ఏదైన ప్రత్యేక ఆఫర్‌ ప్రకటిస్తే అది కంపెనీ మెస్సేజ్‌ రూపంలో వినియోగదారులకు తెలియచేస్తుంది. అంతేకాకుండా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా మసులుకోండి. జాగ్రత్తలు పాటించండి. మీ బ్యాంకు, ఆధార్‌, పర్సనల్‌ విషయాలను ఎటువంటి సందర్భంలోను వెల్లడించొద్దు.

మరిన్ని వార్తలు