ఆ 10 జిల్లాల్లో సైబర్‌ దొంగలు

9 Oct, 2023 04:08 IST|Sakshi

ఇందులో రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ టాప్‌ 

ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అడ్డాలు 

80శాతం సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నది ఆ జిల్లాల నుంచే.. 

ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌ (ఫ్యూచర్‌ క్రైం రీసెర్చ్‌ ఫౌండేషన్‌) నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు.

అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్‌ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్‌ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్‌ క్రైం రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్‌ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. 

ఆ పది జిల్లాలే ఎందుకు? 
సైబర్‌ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్‌ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్‌ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది.

ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్‌ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. 

కొత్తగా సైబర్‌ క్రైం హాట్‌స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ..
అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్‌), ఏపీ (చిత్తూర్‌), బిహార్‌ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్‌), ఢిల్లీ (అశోక్‌నగర్, ఉత్తమ్‌నగర్‌ వెస్ట్, న్యూఅశోక్‌నగర్, హర్కేష్‌ నగర్‌ ఓక్లా, ఆర్‌కే పురం, ఆజాద్‌పురా), గుజరాత్‌ (అహ్మదాబాద్, సూరత్‌), హరియాణా (బివాని, మనోత, హసన్‌పుర్, పల్వల్‌), జార్ఖండ్‌ (లటేహర్, ధన్‌బాద్, సంత్‌పాల్‌ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్‌ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్‌కనల్, జజ్‌పుర్, మయూర్‌భంజ్‌), పంజాబ్‌ (ఫజికా, మొహలి), రాజస్థాన్‌ (బిదర్కా, బర్మార్, జైపూర్‌), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్‌), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్‌నగర్‌), త్రిపుర (ధలాయ్‌), ఉత్తరప్రదేశ్‌ (బులందర్‌షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్‌), పశ్చిమ బెంగాల్‌ (పుర్బ బర్దామన్, దుల్‌చండ్రియ, భద్రల్, దక్షిణ్‌ దినాజ్‌పుర్, బిర్భూమ్, బరున్‌పురా, కోల్‌కతా, మల్దా,               బరంపూర్‌). 

ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్‌ నేరాలు చేస్తున్నారు?
రాజస్తాన్‌: సెక్స్‌టార్షన్‌ (సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ మార్ఫింగ్‌ చేసి మోసగించడం), ఓఎల్‌ఎక్స్‌లో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ పేరిట మోసాలు, కస్టమర్‌ కేర్‌ ఫ్రాడ్స్‌. 
జార్ఖండ్‌: ఓటీపీ స్కామ్‌లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్‌డేషన్, విద్యుత్‌ బిల్లుల పేరిట, కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరిట మోసాలు. 
ఢిల్లీ: ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ల పేరిట వేధింపులు, ఆన్‌లైన్‌ గిఫ్ట్‌ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్‌ మోసాలు, విద్యుత్‌ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసాలు. 
ఉత్తరప్రదేశ్‌: ఫేక్‌ లింకులు (ఫిషింగ్‌), ఓటీపీ మోసాలు, సోషల్‌ ఇంజనీరింగ్‌ స్కామ్‌లు, డెబిట్, క్రెడిట్‌ కార్డుల పేరిట మోసాలు. 

మరిన్ని వార్తలు