ఉగ్రవాదుల నేపథ్యం ఇదీ..

5 Sep, 2018 08:22 IST|Sakshi

ఎనిమిది మంది నిందితుల్లో చిక్కింది ఐదుగురు

ఇద్దరిపై నేర నిరూపణ..బయటపడ్డ మరో ఇద్దరు  

మిగిలిన ఒక్కడిపై సోమవారం తీర్పు

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా జరిగిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వారి వ్యవహారాలు ఇవీ..

రియాజ్‌ భత్కల్‌
ఇతని స్వస్థలం కర్ణాటకలోని భత్కల్‌. గోకుల్‌ఛాట్‌లో బాంబు పెట్టిన వ్యక్తి. ఇండియన్‌ ముజాహిదీన్‌కు రెండో కమాండ్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించాడు. పాకిస్తాన్‌లోని అమీర్‌ రజా ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బును ఏర్పాటు చేశాడు. దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలకు సూత్రధారి. 2013 దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులోనూ వాంటెడ్‌. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని సోదరుడైన ఇక్బాల్‌ భత్కల్‌ సైతం జంట పేలుళ్ల కేసులో నిందితుడు. 

మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి
మహారాష్ట్రలోని పుణెకు చెందిన కంప్యూటర్‌ మెకానిక్‌. విధ్వంసకర్తలకు డ్రైవర్‌గా వ్యవహరించాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి దగ్గర బాంబు పెట్టాడు. మంగుళూరు నుంచి పేలుడు పదార్థాలను రవాణా చేశాడు. సూరత్‌లో దొరికిన బాంబులూ ఇతని పనే. ఇతడిపై నేరం నిరూపితమైంది. అమీర్‌పేటలోని ధూమ్‌ టెక్నాలజీస్‌లో కంప్యూటర్‌ కోర్సులో చేరేప్పుడు తన పేరు వినోద్‌ పాటిల్‌గా పేర్కొన్నాడు.  

అనీక్‌ షఫీక్‌ సయ్యద్‌
ఇతడి స్వస్థలం కూడా పుణె. లుంబినీ పార్కులో బాంబు పెట్టింది ఇతడే. రియాజ్‌ భత్కల్‌ మారిదిగానే ఇండియన్‌ ముజాహిదీన్‌లో సీనియర్‌ సభ్యుడు. పుణెలో కంప్యూటర్లు, మెబైల్స్‌ దుకాణం నిర్వహించేవాడు. ఇతడినీ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది.  

ఫారూఖ్‌ షర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌
పూణెలోని క్యాంప్‌ ఏరియాకు చెందిన వాడు. ‘టి క్యాప్షన్‌ ఔట్‌డోర్‌’ యాడ్‌ ఏజెన్సీ ఉద్యోగి. ఇండియన్‌ ముజాహిదీన్‌లో కీలక ఉగ్రవాది. జంట పేలుళ్ల కుట్రను అమలు చేయడానికి హైదరాబాద్‌ వస్తున్న అనీఖ్‌కు తన బంధువు నవీద్‌ దగ్గర సరూర్‌నగర్‌లో ఆశ్రయం కల్పించి నిందితుడిగా మారాడు. ఇతడిపై అభియోగాలు వీగిపోయాయి.

సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌
ముంబై అంధేరికి చెందిన ఇండియన్‌ ముజాహిదీన్‌ సహ వ్యవస్థాపకుడు. ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడు. విధ్వంసాల వ్యూహకర్తలకు, క్షేత్రస్థాయిలో పాలుపంచుకునే వారికి, ఈ–మెయిల్స్‌ పంపే వ్యక్తులకు మధ్య సంధానకర్త. జంట పేలుళ్లకు అవసరమైన సహకారం అందించాడు. ఇతడి పైనా అభియోగాలు వీగిపోయాయి.  

అమీర్‌ రజా ఖాన్‌
కోల్‌కతా వాసి. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ ఏర్పాటుకు కీలకపాత్ర పోషించాడు. 2001లో కోల్‌కతాలోని అమెరికన్‌ కాన్సులేట్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటూ ఇక్కడ ఉగ్రవాద చర్యలకు సహాయం చేస్తున్నాడు. జంట పేలుళ్లలోనూ ఇతని పాత్ర ఉంది.  

మహ్మద్‌ తారిఖ్‌ అంజుమ్‌ హసన్‌
బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన ఇతగాడు కర్ణాటకలోని భత్కల్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అదే వృత్తిలో ఉన్న ఇతడు 1998లో సిమీ సభ్యుడిగా మారాడు. 2001లో రియాజ్‌ ద్వారా ఐఎంలోకి ప్రవేశించాడు. అమీర్‌ రజాఖాన్‌ నేతృత్వంలో జరిగిన కోల్‌కతా ఎటాక్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ఐఎంలోని ‘టాప్‌ సిక్స్‌’లో ఒకడిగా, దుబాయ్‌ నుంచి ఫైనాన్సియర్‌గా వ్యవహరించాడు. కోర్టు ఇతడిపై సోమవారం తీర్పు వెలువరించనుంది.

మరిన్ని వార్తలు