చదువుకుంటానని మేడపైకి వెళ్లి..

4 Oct, 2019 08:17 IST|Sakshi
మృతి చెందిన విద్యార్థి భార్గవ్‌, ఆస్పత్రి వద్దకు చేరుకున్న గ్రామస్తులు

సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : రోజూ మాదిరిగానే మేడ మీదకు చదువుకుందామని వెళ్లిన విద్యార్థి విద్యుత్‌ షాక్‌ గురై మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ నాయనా.. నువ్వెంతో ప్రయోజకుడవుతావని, ఎన్నో కలలు కన్నాం.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు పోయావా’ అంటూ..  వీరు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ విషాద సంఘటన గురువారం కొత్తూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... కొత్తూరు గ్రామానికి చెందిన సారిపల్లి రామకృష్ణ, లక్ష్మి దంపతుల మొదటి సంతానం భార్గవ్‌(14) కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ తన ఇంటి శ్లాబ్‌పై అందరి పిల్లలతో కలిసి చదువుకుంటుంటాడు. అదే మాదిరిగా గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్‌ బల్బుకు విద్యుత్‌ తీగతో కనెక్షన్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు.

ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితి చేరుకున్న అతడిని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ వైద్యం అందించేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించిన వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సమాచారం మేరకు సీఐ ఎల్‌ సన్యాసినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు