తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల ఎంపిక

4 Oct, 2019 08:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిద్దిపేట: తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్‌ల నియామక ప్రక్రియ నేడు (శుక్రవారం) సంగారెడ్డిలో చేపడుతున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ రామ్మోహన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థలోని వివిధ సంఘాలు ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చినందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తాత్కలిక పద్ధతిలో డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైవర్‌ల ఎంపిక ప్రక్రియ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సంగారెడ్డి ఆర్టీఓ కార్యాలయంలో ఉంటుందన్నారు. ఈ డ్రైవర్‌ పోస్టుకు 18నెలల కాల పరిమితి పూర్తయిన హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి 25 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే కండక్టర్లకు అదేరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి డిపో అవరణలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని, దీనికి 10వ తరగతి పాసైన వారు అర్హులన్నారు.

ఎంపికైన వారు 10వ తరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ను సంబంధిత డిపో మేనేజర్‌ వద్ద సమ్మె కాలంలో భద్రపరచవలసి ఉంటుందని తెలిపారు. రిటైర్డ్‌ అయిన సూపర్‌వైజర్‌లు, అధికారులు, మెకానిక్, క్లరికల్‌ స్టాఫ్‌ పనిచేయడానికి ఆసక్తిగల వారు రీజనల్‌ మేనేజర్‌ సంగారెడ్డి కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలలోపు సంప్రదించాలన్నారు. జీతం రిటైర్డ్‌ అధికారులు, సూపర్‌వైజర్‌లకు రోజుకు రూ.1,500, రిటైర్డ్‌ మెకానిక్, క్లరికల్‌ ఉద్యోగులకు రోజుకు రూ.1,000 వరకు ఉంటుందని, డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రోజుకు రూ.1,000 ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 99592 26266, సిద్దిపేట డివిజనల్‌ ఫోన్‌  నంబర్‌ 99592 26263లలో సంప్రదించాలని 
సూచించారు.  

మరిన్ని వార్తలు