వసూల్ రాజా

26 Feb, 2018 12:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జీతం కంటే... గీతమంటేనే ఆయనకు మక్కువ

వసూళ్ల బాధ్యత హెడ్‌కానిస్టేబుల్‌కు..

ట్రాఫిక్‌ అధికారి అవినీతిపై ఎస్పీకి సిబ్బంది ఫిర్యాదు  

విచారణ చేస్తున్న ఓఎస్‌డీ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ  

కర్నూలు: ట్రాఫిక్‌ మొబైల్‌ డ్యూటీ కావాలా... నెలకు రూ.10వేలు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల కోర్టు కానిస్టేబుల్‌ డ్యూటీ కావాలా...నెలకు రూ.20వేలు. యాక్సిడెంట్‌ కేసులో డ్రైవర్‌కు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలా... రూ.10వేలు.. ఓ ట్రాఫిక్‌ అధికారి వసూళ్ల చిట్టా ఇది. నగరంలోని ట్రాఫిక్‌ విభాగంలో అవినీతి మూడు బెయిళ్లు, ఆరు మామూళ్లుగా వర్థిల్లుతోన్న అవినీతిపై కిందిస్థాయి సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. హోదాకు తోడు అధికారపార్టీ నాయకుల అండతో రెండు చేతులా సంపాదిస్తున్నాడనే చర్చ ఆ శాఖలో జోరుగా సాగుతోంది. వసూళ్ల బాధ్యతలను ప్రత్యేకంగా ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు అప్పగించాడంటే అవినీతిపర్వం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

ప్రతి పనికి ఓ రేటు..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన డ్రంకెన్‌ డ్రైవ్‌ కార్యక్రమం ఆ అధికారికి వరంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలు, జీరో వ్యాపారం, వరికోత యంత్రాలు, పశువుల లారీలు, ఇసుక ట్రాక్టర్లు అక్రమ సంపాదనకు ప్రధాన వనరులు. వసూళ్ల కోసం నియమించుకున్న ప్రత్యేక బృందం వాటిపై  నిఘా వేసి దందాను కొనసాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఆయనకు నెలకు వచ్చే జీతం కంటే గీతం మీదే మక్కువ ఎక్కువనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు కోర్టులో రూ.1800 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తారు. అయితే కోర్టు కానిస్టేబుల్‌ ఒక్కొక్కరి నుంచి రూ.3వేలు వసూలు చేసి ఆయనకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలున్నాయి. వసూళ్లు చేసుకోవడమే దినచర్యగా మారిందని ఆయన కిందపనిచేసే సిబ్బంది జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.  

అంతర్గత విచారణ షురూ..
మామూళ్ల వ్యవహారంపై సిబ్బంది చేసిన ఫిర్యాదుపై స్పందించి జిల్లా ఎస్పీ గోపీనాథ్‌ జట్టి రహస్యంగా విచారణ జరిపిస్తున్నారు. మూడురోజుల క్రితం ఓఎస్‌డీ రవిప్రకాశ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 2 గంటల పాటు సిబ్బందిని ఒక్కొక్కరిని పిలిచి అంశాల వారీగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్‌బీ 2 డీఎస్పీ నజీముద్దీన్‌ కూడా రెండు రోజుల క్రితం ట్రాఫిక్‌ స్టేషన్‌లో విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది.

మామూళ్ల చిట్టా..
యాక్సిడెంట్‌ కేసులో వాహన యజమానికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి రూ.10 నుంచి రూ.15వేలు.  
గాంధీనగర్‌లోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ నుంచి నెలకు రూ.20వేలు  
సంతోష్‌నగర్‌ సమీపంలోని పొట్టులారీల నుంచి రూ.20వేలు   
నగరంలో తిరిగే వాటర్‌ ట్యాంకర్ల యజమానుల నుంచి రూ.40వేలు   
నగరంలో భారీ వాహనాలకు పగటిపూట ప్రవేశం లేదు. అయితే రైల్వేస్టేషన్‌ దగ్గర ఉన్న గోదాముల వద్ద నుంచి హనుమాన్‌ కాటా వరకు బియ్యం, ఎరువులు తరలించే లారీలు తిరగడానికి అనుమతిచ్చినందుకు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌ నుంచి నెలకు రూ.30వేలు వసూలు చేస్తున్నారని ట్రాఫిక్‌ సిబ్బంది ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు