ఉద్యోగం రాక బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

18 May, 2018 10:42 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న కృష్ణచైతన్య(ఫైల్‌)

కర్నూలు : ఉద్యోగ వేటలో విసిగి వేజారి, తల్లిదండ్రులపై ఆధారపడి జీవించడం ఇష్టం లేక తీవ్ర మనస్తాపంతో కర్నూలు నగరం శ్రీరామ్‌నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి కృష్ణచైతన్య (22) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణచైతన్య నగర శివారులోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. ఏడాది కాలంగా ఉద్యోగ వేటలో  భాగంగా బెంగళూరు, హైదరాబాద్‌ తిరుగుతుండేవాడు. అయినా ప్రయత్నాలు ఫలించలేదు.  తీవ్ర మనస్తాపం చెందాడు.

బుధవారం రాత్రి బయటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌కు ఎదురుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని గురువారం ఉదయం  స్థానికులు గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ ఆనందరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహం సమీపంలోనే సెల్‌ఫోన్‌ పడివుండటంతో అందులోని అడ్రెస్‌ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. తండ్రి చంద్రశేఖర్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు హరీష్‌ నగరంలోని శకుంతల కళ్యాణమండపం దగ్గర ఓ బుక్‌ సెంటర్‌లో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. తాను ఉన్నత చదువు చదివినప్పటికీ తల్లిదండ్రుల పోషణకు ఏమీ చేయలేకపోతున్నానంటూ కొంతకాలంగా బాధపడుతుండేవాడని తండ్రి చంద్రశేఖర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

మరిన్ని వార్తలు