బస్సును ఢీకొన్న లారీ

26 Mar, 2018 10:20 IST|Sakshi
ట్రాఫిక్‌ ఐలాండ్‌పైకి దూసుకెళ్లి ఆగిన బస్సు

ఇద్దరు మహిళలకు తెగిన కాళ్లు

నడిరేయిలో రేణిగుంట చెక్‌పోస్ట్‌ వద్ద ఘటన

బస్సు డ్రైవర్‌ చాకచక్యంతో తప్పిన భారీ ప్రాణనష్టం

రేణిగుంట: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం నడిరేయి రేణిగుంట చెక్‌ పోస్టు సమీపంలో జరిగింది. శ్రీవారి దర్శనం ముగించు కున్న భక్తులు, ఇంకొందరు సొంత పనులు ముగించుకుని తిరుపతి నుంచి విజయవాడ బస్సులో బయలుదేరారు. ఆ బస్సు రేణిగుంట చెక్‌పోస్టు సమీ పంలోని శ్రీకాళహస్తి మార్గంలో మలుపు తిరిగింది. అదే సమయం బస్సుకు ఎడమ పక్క నుంచి మితిమీరిన వేగంతో దూసుకుని వచ్చిన లారీ ఢీకొని వెళ్లింది. ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ లారీ ఢీకొన్న ధాటికి బస్సు అంతెత్తున ఎగిరి ట్రాఫిక్‌ ఐలాండ్‌పైకి దూసుకుని వెళ్లింది. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కాగా, లారీ ఢీకొన్న ధాటికి బస్సులో కిటికీ పక్కన కూర్చుని ఉన్న ఇద్దరు మహిళలు రోడ్డుపైకి ఎగిరి పడడంతో కాళ్లు విరిగాయి. వీరిది తెలంగాణ  రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా అని బాధిత మహిళల సంబంధీకులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో కిటికీల నుంచి దూకారు. కాగా, బస్సును ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయింది. అదే సమయంలో పోలీసు పట్రోలింగ్‌ లేకపోవడంతో ఘటన జరిగిన వెంటనే బాధితులకు సహాయ చర్యలు అందించే వారు కరువయ్యారు. ఆలస్యంగా రేణిగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు