హోటల్‌ బిల్లు ఎగ్గొట్టిన వైద్యుడిపై కేసు

5 Jun, 2019 07:39 IST|Sakshi

బంజారాహిల్స్‌: హోటల్‌ బిల్లు ఎగ్గొట్టి వెళ్లిన వైద్యుడిపై చర్య తీసుకోవాలంటూ హోటల్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన డాక్టర్‌ అపరాజిత్‌ బాసక్‌ కుటుంబంతో కలిసి గత నెల 22న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఆర్‌ఎన్‌ఎం హోటల్‌కు వచ్చాడు. తాను తొమ్మిది రోజులు బస చేస్తానని చెప్పి సంబ ంధిత పత్రాలు అందజేశాడు.

ఇందుకు రూ.80 వేల బిల్లు అవుతుందని ఇందులో సగం మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని హోటల్‌ మేనేజర్‌ మిశ్రా సూచించాడు. తాను బాగా అలిసిపోయానని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం డబ్బులు చెల్లిస్తానని చెప్పి కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. అయితే రెండు, మూడు రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోగా, ఇప్పుడు..అప్పుడు అంటూ తప్పించుకునేవాడు. మంగళవారం తెల్లవారుజామున హోటల్‌ సిబ్బంది కళ్లుగప్పి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ హోటల్‌ మేనేజర్‌ పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్‌ అపరాజిత్‌ ఇచ్చిన ఆధార్‌కార్డు జీరాక్స్‌ కాపీని ఫిర్యాదుతో జతపర్చాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు