One Nation One Registration: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి?

1 Nov, 2023 12:19 IST|Sakshi

దేశంలోని వైద్యులకు సంబంధించిన ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ కమిషన్ పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేసిందని, దీని ట్రయల్ రాగల ఆరు నెలల్లో ప్రారంభం కానున్నదని సమాచారం. ట్రయల్‌ అనంతరం ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు.

‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ కింద దేశంలోని ప్రతి డాక్టర్‌కి యూనిక్ ఐడీ  అందజేస్తారు. ఈ యూనిక్ ఐడీ ద్వారా వైద్యునికి గుర్తింపు కల్పిస్తారు. ఈ ఐడీలో ఆ వైద్యుని శిక్షణ, అతని లైసెన్స్‌కు సంబంధించిన అన్ని పత్రాల గురించిన సమాచారం ఉంటుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ ప్రత్యేక ఐడీని ఐటీ ప్లాట్‌ఫారమ్‌నకు లింక్ చేస్తుంది.

జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి డాక్టర్ యోగేంద్ర మాలిక్ మాట్లాడుతూ ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్‌’పై ఇప్పటికే చాలా కసరత్తు జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో వైద్యునికి రెండుసార్లు యూనిక్ ఐడీ ఇస్తారు. అతను ఎంబీబీఎస్‌ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు  మొదటిసారిగా ఇస్తారు. ఆ సమయంలో ఇచ్చిన ఐడీ తాత్కాలికంగా ఉంటుంది. అతని చదువు పూర్తయ్యాక అతనికి శాశ్వత సంఖ్య ఇస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులకు శాశ్వత యూనిక్ ఐడీ ఇస్తారు. 

ఈ ప్రత్యేకమైన ఐడీని అందుకున్న వైద్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేయించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో దాదాపు 14 లక్షల మంది నమోదిత వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు. దేశంలోని 200కి పైగా మెడికల్ కాలేజీల్లో 1.08 లక్షలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండటం అవసరం. అయితే భారతదేశం చాలా కాలం క్రితమే ఈ ప్రమాణాన్ని అధిగమించిందని జాతీయ ఆరోగ్య కమిషన్ చెబుతోంది. 
ఇది కూడా చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు ‘వీర్యం నీరు’.. తరువాత జరిగిందిదే!

మరిన్ని వార్తలు