నపుంసకత్వం కేసు.. గుర్మీత్‌ పీఏను కూడా వదల్లేదు

12 Oct, 2017 10:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్ పై నమోదయిన మరికొన్ని కేసుల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో 400 మందిని నంపుసకులుగా మార్చారన్న కేసు ఒకటి. డేరాబాబా మాజీ అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.

ప్రత్యేక కోర్టు అనుమతితో బుధవారం రోహ్‌తక్‌ జైల్లో ఉన్న గుర్మీత్‌ నుంచి సీబీఐ స్టేట్‌మెంట్‌ను నిన్న రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు త్వరలో పూర్తి నివేదికను పంజాబ్‌ హర్యానా హైకోర్టుకు అందిస్తామని సీబీఐ తెలిపింది. అందులోని సమాచారం ప్రకారం... భగవంతుడిని చేరాలంటే మగతానాన్ని పరిత్యజించి తనను పూజించాలని గుర్మీత్‌ చెప్పేవాడని.. 2000 సంవత్సరంలో తనతోపాటు మరో 400 మంది వృషణాలను తొలగించి నపుంసకులుగా మార్చాడని హంసరాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనకు నష్టపరిహారం ఇప్పించాలని 2012లో హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశాడు కూడా. దీంతో సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించగా.. 2015లో కేసు కూడా నమోదు అయ్యింది. 

డేరాలోని డాక్టర్లే ఈ శస్త్రచికిత్సలు చేశారని దర్యాప్తులో సీబీఐ అధికారులు గుర్తించారు. స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, అనుచరులను మాత్రం నపుంసకులుగా మార్చిన సంగతి తెలిసిందే.  చివరకు డేరాబాబా తన వ్యక్తిగత సలహాదారు రాకేష్‌ను కూడా వదల్లేదు. తాను వద్దని వేడుకుంటున్నా తనకు కూడా ఆపరేషన్ చేయించాడని రాకేష్‌ తెలిపాడు.  రాకేష్‌తోపాటు, న్యాయసలహాదారు దాస్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ కూడా వృషణాలు లేవని తేలింది. దీంతో షాక్‌ తిన్న అధికారులు మరికొందరు ప్రధాన అనుచరుల్ని పరీక్షించి చివరకు డేరా బాబా స్టేట్‌మెంట్ నమోదు చేశారు. 

గుర్మీత్ దగ్గర పైసల్లేవ్‌... 

అత్యాచార కేసులో బాధిత మహిళలకు 30 లక్షలు చెల్లించాలన్న పంచకుల కోర్టు ఆదేశాలపై గుర్మీత్‌ అభ్యంతరం పిటిషన్‌ దాఖలు చేశాడు. డేరా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసినందున బాధితులకు చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదని పిటిషన్లో గుర్మీత్ పేర్కొన్నాడు. దీంతో కోర్టు గుర్మీత్‌కు రెండు నెలల గడువు విధించింది. అల్లర్ల అనంతరం జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు డేరా సచ్ఛా సౌధా ఆస్తులను జప్తు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు