ఏం చెప్పారో.. ఆ నలుగురు!

9 Mar, 2018 12:44 IST|Sakshi

ట్రేడ్‌ బ్రోకర్‌ కేసులో కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

మందరాడకు చెందిన నలుగురిని విచారించిన అధికారులు

సంతకవిటి: మండలంలో మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్‌బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌ ఆన్‌లైన్‌ మోసానికి సంబంధించిన కేసుపై విశాఖ సీఐడీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మందరాడకు చెందిన గార ప్రతాప్, గార ఉమామహేశ్వరరావు, యడ్ల హరిబాబు, సాకేతి ప్రసాద్‌లను గురువారం విశాఖపట్నం పిలిపించుకొని విచారణ చేపట్టారు. ట్రేడ్‌బ్రోకర్‌కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించడంతోపాటు పలు అంశాలపై దర్యాప్తు జరిపినట్లు తెలిసింది. శ్రీరామ్‌తో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం.

ఎవరా ప్రతాప్‌..
మందరాడకు చెందిన గార ప్రతాప్‌ హైదరాబాద్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన తన స్నేహితులతో కలసి శ్రీరామ్‌ వద్ద భారీగా పెట్టుబడులు పెట్టారు. శ్రీరామ్‌తో పలు సందర్భాల్లో సన్నిహితంగా గడపడంతో ప్రతాప్‌ను విచారించినట్లు తెలిసింది. అయితే తన వద్ద ఎటువంటి సమాచారం లేదని, కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానని ప్రతాప్‌ చెప్పినట్లు సమాచారం.

మిగిలిన ముగ్గురెవరు..
సీఐడీ పోలీసులు విచారణకు ఆదేశించిన వారిలో గార ఉమామహేశ్వరరావు మందరాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈయన కూడా శ్రీరామ్‌తో సన్నిహితంగా ఉండేవాడు. గార ప్రతాప్‌కు స్వయాన తండ్రి. శ్రీరామ్‌ వద్ద పెట్టుబడులు పెట్టడంతోపాటు లాభాలు కూడా పొందినట్లు పలువురు బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఉమామహేశ్వరరావును విచారణకు పిలిచినట్లు తెలిసింది.  సాకేతి ప్రసాద్, యడ్ల హరిబాబులు శ్రీరామ్‌ వద్ద ట్రేడ్‌ కార్యాలయంలో పనిచేసేవారు. శ్రీరామ్‌తో సన్నిహితంగా ఉంటూ ఖాతాదారుల వద్దకు వెళ్తుండేవారు. ఈ నేపథ్యంలోనే వీరిని కూడా విచారణకు పిలిచించారు.

సుదీర్ఘ విచారణ..
గార ప్రతాప్‌ను సుదీర్ఘంగా విచారణ జరిపినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురిని శుక్రవా రం విచారించనున్నట్లు సమాచారం. పలు రికార్డులపై సంతకాలు కూడా తీసుకుంటున్నట్లు తెలి సింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతోపాటు పెట్టుబడులు ఎటువైపు మళ్లి ఉంటాయోనన్న దానిపై ఈ దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

ఆ లేఖలపై ఆరా..
సీఐడీ పోలీసులు శ్రీరామ్‌ పరారీకి ముందు రాసిన లేఖలపై ఆరా తీసినట్లు అధికారులు తెలిపారు. లేఖలు ఏ పరిస్థితిలో రాయాల్సి వచ్చింది.. లేఖలు అందినవారు ఎటువంటి సలహాలు ఇచ్చారనేదానిపై ఆరా తీస్తున్నారని పోలీసులు విలేకరులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు