బ్రైన్‌ స్టోక్‌తో కానిస్టేబుల్‌ మృతి

2 Jan, 2018 11:47 IST|Sakshi

డీపీటీసీలో ఘటన

ఆధారం కోల్పోయిన మృతుని కుటుంబం

వల్లభరావుపేటలో విషాదం

రణస్థలం/శ్రీకాకుళం రూరల్‌: మండలంలోని వల్లభరావుపేట గ్రామానికి చెందిన ట్రైనీ సివిల్‌ కానిస్టేబుల్‌ పిల్లా సుబ్బారావు(23) బ్రెయిన్‌  స్ట్రోక్‌తో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు, కుటుంబçసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. 2017 జనవరిలో విశాఖపట్నం జిల్లాకు సివిల్‌ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాడు. శ్రీకాకుళంలోని తండేవలసలో ఉన్న జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం వరకు పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణ పొందారు. తర్వాత అర్ధరాత్రి వరకు తోటి స్నేహితులతో సందడిగా గడిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో హైబీపీ ఒక్కసారిగా రావడంతో తోటి స్నేహితులు వెంటనే రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రిమ్స్‌ వైద్యులు పరిశీలించాక తలంతా ఓ రంగులోకి మారిపోయిందని, మెదడులో నరాలు కదలికలు లేక రక్తం గడ్డికట్టినట్టుగా గుర్తించారు. వెంటనే బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేసేందుకు జెమ్స్, కిమ్స్‌ వైద్యులను సంప్రదించారు. ఆ ఆపరేషన్‌ చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వెంటనే ఉన్నత వైద్యుల సలహాలు మేరకు విశాఖపట్నంలోని అత్యున్నతమైన ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. హైబీపీ వల్ల బ్రెయిన్‌  స్ట్రోక్‌ వచ్చి మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. మంగళవారం ఉదయం పోలీసు లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు చేస్తామని జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు.

గ్రూప్స్‌లో ఉద్యోగమే లక్ష్యంగా సాధన
ఇదిలావుండగా సుబ్బారావు గ్రూప్స్‌లో ఉద్యోగం సాధించే దిశగా హైదరాబాద్‌లో ఓ శిక్షణ సంస్థలో కొన్ని నెలలు శిక్షణ తీసుకున్నాడు. ఆ ఉద్యోగంలో అర్హత సాధించకపోవడం, తర్వాత వీఆర్‌వో ఉద్యోగంలో కూడా అనుకున్న మార్కులు రాకపోవడంతో మనస్థాపం చెందినట్టు తోటి మిత్రులు తెలిపారు. ప్రతీసారి ఈ విషయాలనే తలచుకొని ఏదో కోల్పోయినట్టు దిగాలుగా ఉండడం, ఎక్కువగా ఆలోచించడం, ఎవరితో మాట్లాడకపోవడం చేసేవాడని తోటి ట్రైనీలు చెబుతున్నారు. అతిగా ఆలోచించడం వల్లే మెదడు మరింత వత్తిడికి గురైనట్టు వైద్యులు గుర్తించారు. రిమ్స్‌ ఆస్పత్రిలో చేరినప్పుడే బీపీని పరిశీలించగా 100/180 ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

దిక్కు కోల్పోయిన కుటుంబం  
పిల్లా సుబ్బారావు మృతితో వల్లభరావుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబానికి సుబ్బారావుకు ఉద్యోగం రావడంతో ఆధారం దొరికిందని సంబరపడిపోయారు. అయితే ఏడాదిలోపే ఇలా జరగడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి తవిటినాయుడు, తల్లి అనసూయమ్మ కాయకష్టం చేసి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను చదివించారు. వీరిలో చిన్నవాడైన సుబ్బారావు మృతితో కుటుంబం ఆధారం కోల్పోయింది. మమ్మల్ని ఆదుకోవాలని జిల్లా ఎస్పీ సి.ఎం.త్రివిక్రమవర్మకు మృతుని కుటుంబ సభ్యులు కోరారు.

తల్లడిల్లిపోయిన ఏఎస్పీ
విషయం తెలుసుకున్న ఏఎస్పీ పనసారెడ్డి వెంటనే రిమ్స్‌కు చేరుకున్నారు. అయితే కుమారుడు మృతదేహాన్ని చూసి తండ్రి తవిటినాయుడు బోరునా విలపించాడు. అక్కడే వైద్యులతో  మాట్లాడుతున్న ఏఎస్పీ ఆయన్ను చూసి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. ఎలా ఓదార్చాలో తెలియక కాసేపు ఉద్వేగంకు గురయ్యారు. కొత్త సంవత్సరంతో దేవుడు మాకు ఇలాంటి కడుపుకోతను మిగిల్చాడంటూ కుటుంబీకులంతా గుండెలవిసేలా విలపించారు. శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు