Israel-Hamas War: గాజా.. మరుభూమి! 

15 Nov, 2023 03:45 IST|Sakshi

మృత్యుదిబ్బలుగా ఆస్పత్రులు! అల్‌ షిఫాలో 179 మృతదేహాల ఖననం 

తీవ్ర అపరిశుభ్రత, ప్రాణాంతక రోగాలు 

పని చేస్తున్నది అల్‌ అహ్లి ఆస్పత్రి ఒక్కటే 

గాజా పార్లమెంటును ఆక్రమించిన ఇజ్రాయెల్‌ 

దెయిర్‌ అల్‌ బలాహ్‌/జెరూసలేం/టెల్‌ అవీవ్‌: గాజాలో పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. కరెంటు తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ పూర్తిగా నిండుకోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచే పూర్తిగా పడకేసిన ఆస్పత్రులు క్రమంగా మృత్యుదిబ్బలుగా మారుతున్నాయి. రోగులు, నవజాత శిశువుల నిస్సహాయ సామూహిక మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్‌ షిఫాలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 179 మృతదేహాలను ప్రాంగణంలోనే ఒకే చోట సామూహికంగా ఖననం చేసినట్టు ఆస్పత్రి డైరెక్టర్‌ అబూ సలామియా తాజాగా నిర్ధారించడం పరిస్థితికి అద్దం పడుతోంది! వీరిలో చాలామంది ఐసీయూ రోగులు, నవజాత శిశువులేనని సమాచారం.

అక్కడ 30కి పైగా శవాలను ఖననం చేస్తుండగా చూసినట్టు అక్కణ్నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి కూడా వెల్లడించారు. పలు ఇతర ఆస్పత్రుల్లోనైతే మృతదేహాలు కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నట్టు సమచారం. ప్రస్తుతం ఉత్తర గాజాలో అల్‌ అహ్లి బాప్టిస్ట్‌ ఆస్పత్రి మాత్రమే కాస్తో కూస్తో పని చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఒక్క మంగళవారమే 500 మందికి పైగా క్షతగాత్రులు అందులో చేరినట్టు వివరించింది. కరెంటు లేకపోవడం, ఆక్సిజన్, ఇంధనంతో పాటు ఆహార పదార్థాలు, నిత్యావసరాలన్నీ నిండుకుంటుండటంతో అది కూడా ఏ క్షణమైనా పూర్తిగా మూతబడే పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చింది.

మరోవైపు గాజా అంతటా ఎటు చూసినా వ్యర్థాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మురుగు నీరు పొంగి పొర్లుతోంది. వాటిద్వారా ఇప్పటికే పలు అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తే గాజా మరుభూమిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చలి, చెదురుమదురు వర్షాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. 

జబాలియాలో 30 మంది మృతి: మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధ బీభత్సం మంగళవారం కూడా యథాతథంగా కొనసాగింది. ఆస్పత్రులతో పాటు ఇంకా చెదురుమదురుగా మిగిలి ఉన్న భవనాలన్నీ క్షిపణి, బాంబు దాడులు, కాల్పులతో అల్లాడిపోయాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడులు మరో 30 మందిని బలిగొన్నట్టు తెలుస్తోంది. గాజాలోని పార్లమెంటు భవనాన్ని ఇజ్రాయెల్‌ సైనికులు ఆక్రమించారు.

భవనం లోపల ఇజ్రాయెల్‌ పతాకాలతో ఉన్న సైనికుల ఫొటోలు ఆ దేశ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌)కు చెందిన గోల్డెన్‌ బ్రిగేడ్‌ గాజా పార్లమెంటును స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటిదాకా 100 మందికి పైగా ఐరాస వర్కర్లు యుద్ధానికి బలయ్యారు. మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 11,550 దాటినట్టు గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. వీరిలో మూడొంతులు మహిళలు, పిల్లలేనని పేర్కొంది. 

 ఆస్పత్రులను కాపాడాలి: బైడెన్‌
బందీల విడుదలకు కృషి చేస్తున్నట్టు తాము కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. అల్‌ షిఫాతో పాటు గాజాలో ఆస్పత్రులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కాపాడాలన్నారు. ఏ ఆస్పత్రి మీదా ఇజ్రాయెల్‌ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడరాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, పట్టు వీడేందుకు ఇప్పటిదాకా ససేమిరా అంటున్న ఇజ్రాయెల్‌ కూడా కాస్త దిగొస్తున్నట్టు కన్పిస్తోంది. గాజా ఆస్పత్రుల్లో మృత్యుముఖంలో ఉన్న నవజాత శిశువులను సురక్షితంగా తరలించేందుకు ఇంక్యుబేటర్లను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆస్పత్రులే కమాండ్‌ సెంటర్లు: ఇజ్రాయెల్‌ 
ఆస్పత్రులను హమాస్‌ తన స్థావరాలుగా మార్చుకుందని ఇజ్రాయెల్‌ మరోసారి ఆరోపించింది. ఇందుకు ఆధారాలున్నట్టు పేర్కొంది. రంటిసీ పిల్లల ఆస్పత్రిలో గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలతో కూడిన కమాండ్‌ సెంటర్‌ను గుర్తించామంటూ సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ బందీలను కూడా అక్కడే దాచారని అనుమానం వెలిబుచ్చింది. వీటిని హమాస్‌ మరోసారి ఖండించింది. ఆస్పత్రులపై నిస్సిగ్గు దాడులను సమర్ధించుకునేందుకే ఇజ్రాయెల్‌ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని  దుయ్యబట్టింది.  

వాళ్లు రోగులు.. జంతువులు కాదు! కంటతడి పెట్టిస్తున్న డాక్టర్‌ ఇంటర్వ్యూ 

అల్‌ షిఫా ఆస్పత్రిని తక్షణం వీడాలన్న ఇజ్రాయెల్‌ ఆదేశాలను వైద్య సిబ్బంది మంగళవారం కూడా తిరస్కరించారు. 700 మందికి పైగా నిస్సహాయులైన రోగులను ప్రాణాపాయ పరిస్థితుల్లో వదిలి వెళ్లలేమని స్పష్టం చేశారు! ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన హమామ్‌ అల్లో అనే నెఫ్రాలజిస్టు మరణానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘‘ఆస్పత్రిలో, ఐసీయూ వార్డుల్లో అంతమంది ఉన్నారు. వారంతా రోగులు. జంతువులు కారు.

నేను వెళ్లిపోతే వారికి చికిత్స అందించేదెవరు? చికిత్స పొందడం వారి హక్కు. వారి కర్మకు వారిని వదిలి వెళ్లలేం. 14 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకున్నది ఇలా కేవలం నా జీవితాన్ని కాపాడుకునేందుకు రోగులను నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లిపోయేందుకు కాదు’’ అంటూ కొద్ది రోజుల క్రితం డెమొక్రసీ నౌ అనే స్వతంత్ర పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు.

కుటుంబంతో పాటు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలను హమామ్‌తో పాటు ఆయన కుటుంబం కూడా బుట్టదాఖలు చేసింది. అత్తగారింట్లో ఉండగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హమామ్‌తో పాటు ఆయన తండ్రి, మామ, బావమరిది దుర్మరణం పాలయ్యారు! స్వేచ్ఛాయుత పాలస్తీనా కోసం హమామ్‌ నిత్యం కలలు కనేవాడని గుర్తు చేసుకుంటూ తోటి నెఫ్రాలజిస్టు బెన్‌ థామ్సన్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.  

కాల్పులాపితే బందీల విడుదల: హమాస్‌ 
యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించని పరిస్థితుల్లో, కనీసం కాల్పుల విరామం కోసం హమాస్‌ ప్రయత్నిస్తోంది. ఐదు రోజుల పాటు కాల్పులాపితే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీల్లో 70 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఖతార్‌ మధ్యవర్తుల ద్వారా దీన్నిప్పటికే ఇజ్రాయెల్‌కు చేరవేసినట్టు తెలిపింది.

ఇజ్రాయెల్‌ చెరలో ఉన్న 200 మంది పాలస్తీనా చిన్నారులు, 75 మంది మహిళలను వదిలేస్తే తమ వద్ద ఉన్న బందీల్లో మహిళలు, పిల్లలను విడుదల చేస్తామని గత వారం కూడా హమాస్‌ ప్రకటించడం తెలిసిందే. హమాస్‌ చెరలో 240 మందికి పైగా ఇజ్రాయెలీలున్నట్టు సమాచారం. అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పొల్జారిక్‌ మంగళవారం ఇజ్రాయెల్లో వారి కుటుంబాలను కలుసుకుని ధైర్యం చెప్పారు.  

మరణానంతర ప్రసవాలు! 
ఆస్పత్రులపై ఇజ్రాయెల్‌ దాడులు అంతులేని దారుణాలతో పాటు పలు విషాదాలకూ కారణంగా మారుతున్నాయి. సౌకర్యాల లేమి తదితరాల కారణంగా ఆస్పత్రుల్లో ఎందరో నిండు గర్భిణులు దుర్మరణం పాలైనట్టు హమాస్‌ ఆరోగ్య శాఖ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘అలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ వృత్తి ధర్మం మరవలేదు. ఎప్పటికప్పుడు ఆ మృతదేహాలకు హుటాహుటిన సిజేరియన్‌ చేసి వీలైనంత మంది శిశువులను బయటికి తీసి కాపాడుతూ వచ్చారు’’ అని పేర్కొంది. ఇంక్యుబేటర్లతో పాటు ఏ సదుపాయాలూ లేక ఆ నవజాత శిశువులు కూడా మృత్యువుకు చేరువవుతున్నట్టు చెప్పింది.  

బయటపడ్డ కశ్మిరీ మహిళ 
లుబ్నా నజీర్‌ షాబూ అనే కశ్మిరీ మహిళ తన కూతురు కరీమాతో పాటు గాజా నుంచి మంగళవారం సురక్షితంగా బయట పడింది. వారిద్దరూ ఈజిప్టు చేరినట్టు భర్త వెల్లడించారు. ఈజిప్టులోని భారత మిషన్ల కృషి వల్లే తాను, తన కూతురు గాజా నుంచి బయట పడ్డట్టు లుబ్నా చెప్పారు. గాజాలో సర్వం నేలమట్టమైందని ఆవేదన వెలిబుచ్చారు. 

మరిన్ని వార్తలు