అడవిలో అవినీతి మొక్క

15 Mar, 2018 11:31 IST|Sakshi
కొల్లాపూర్‌ అటవీశాఖ కార్యాలయం, (ఇన్‌సెట్లో) రేంజర్‌ కృష్ణ

అక్రమాలకు నిలయంగా అటవీశాఖ కార్యాలయం

సస్పెన్షన్‌కు గురైన కొల్లాపూర్‌ ఫారెస్టు రేంజర్, ఇద్దరు సిబ్బంది

ప్లాంటేషన్‌లో అవినీతిపై నిగ్గుతేల్చిన ఉన్నతాధికారులు

సస్పెన్షన్‌ విషయాన్ని గోప్యంగా ఉంచిన సిబ్బంది

కొల్లాపూర్‌: విధినిర్వహణలో అవకతవకలు, మొక్కల పెంపకం పేరుతో అక్రమాల కారణంగా కొల్లాపూర్‌ ఫారెస్టు రేంజర్‌ తాండ్ర కృష్ణ సస్పెన్షన్‌కు గురయ్యారు. మూడు రోజుల క్రితమే కృష్ణ సస్పెన్షన్‌కు గురైనప్పటికీ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారు. మరోదిక్కు సస్పెన్షన్ల ఎత్తివేత కోసం రేంజర్‌ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మండలంలోని ఎర్రగట్టు బొల్లారంలో గతేడాది చేపట్టిన ప్లాంటేషన్‌లో అవకతవకలకు పాల్పడ్డారని తేలడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటుపడింది.

మొక్కల పెంపకంలో..
గత జూన్‌లో అటవీశాఖ ప్లాంటేషన్‌ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా నార్లాపూర్‌లో 20 హెక్టార్లు, ఎర్రగట్టు బొల్లారంలో 30 హెక్టార్లు, గేమ్యానాయక్‌తండా సమీపంలో 20 హెక్టార్లలో మొక్కలు నాటారు. వీటిపై విజిలెన్స్‌ బృందం విచారణ జరిపింది. ఎర్రగట్టు బొల్లారంలో ప్లాంటేషన్‌ కేవలం 12 హెక్టార్లలోనే జరిగిందని, మిగతా భూమిలో ప్లాంటేషన్‌ చేయకున్నా బిల్లులు చేశారని పేర్కొంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో మరో బృందం కూడా వచ్చి అక్రమాలు నిజమేనని తేల్చడంతో రేంజర్‌పై వేటుపడింది. ఆయనతోపాటు సెక్షన్‌ ఆఫీసర్‌ గాలెన్న, బీట్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌లను సైతం సస్పెన్షన్‌ చేసినట్లు డీఎఫ్‌ఓ జోజీ తెలిపారు.

రద్దు కోసం పైరవీలు..
సస్పెన్షన్‌ వేటును రద్దు చేయించుకునేందు కోసం రేంజర్‌తోపాటు సెక్షన్‌ ఆఫీసర్, బీట్‌ ఆఫీసర్లు పైరవీలు చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో అటవీశాఖ మంత్రి జోగు రామన్న, స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసినట్లు తెలిసింది. తమను ఉద్దేశపూర్వకంగానే బలి చేశారని మొరపెట్టుకున్నట్లు సమాచారం. కొల్లాపూర్‌ రేంజర్‌గా ఇప్పటికే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంలో విధులు నిర్వహిస్తున్న వీరేంద్రబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సస్పెన్షన్‌కు గురైన రేంజర్‌ కృష్ణ సస్పెన్షన్‌ ఉత్తర్వులు స్వీకరించకపోవడంతో అధికార బదిలీ ఇంకా జరగలేదు. నేతల ఒత్తిళ్ల కారణంగా సస్పెన్షన్లు రద్దవుతాయా లేక యథాతథంగా సస్పెన్షన్లు కొనసాగుతాయా అనేది వేచిచూడక తప్పదు.

ఆది నుంచీ వివాదాలే..
కృష్ణ రేంజర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శాఖాపరమైన వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఆయనకు శాఖలో కొందరు ఉద్యోగులు సహకరించడంతో మామూళ్ల పర్వం కూడా పెరిగిందనే విమర్శలున్నాయి. నచ్చిన వారికో న్యాయం, నచ్చని వారికి మరో న్యాయం అనే రీతిలో కార్యాలయ విధులు కొనసాగుతున్నాయి. వెదురు బొంగు నరికివేత, కలప అక్రమ తరలింపు, అలవి వలల వినియోగం వంటి అంశాల్లో ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు సైతం బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు