ఆటో మొబైల్‌ దొంగల ముఠా అరెస్ట్‌: సీపీ అంజనీకుమార్‌

16 Dec, 2019 18:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆటో మొబైల్‌, మొబైల్ దొంగతనాలు చేస్తున్న 11 మంది గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు అమీర్‌ఖాన్‌తో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాలో ఓ మైనర్ కూడా ఉన్నాడని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. దొంగిలించిన వస్తువులను ఈ ముఠా నుంచి తీసుకుంటున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై సుమారు 33 కేసులు ఉన్నాన్నాయని ఆయన వెల్లడించారు. 27 బైక్‌లు, 5 సెల్ ఫోన్లు, 1 ఆటోను పోలీసుల స్వాధీనం చేసుకున్నారని సీపీ వెల్లడించారు.

ఈ ముఠాలో ఏ1 దొంగ అమీర్‌ఖాన్ మెకానిక్‌గా పని చేశాడు. దీంతో తాళం లేకుండా బైక్‌లు ఎలా దొంగలించాలో బాగా నేర్చుకున్నాడని సీపీ అంజనీకుమార్‌ వివరించారు. అలాగే గ్యాంగ్‌కి మొత్తానికి నేర్పించి బైక్ దొంగతనాలకి పాలపడుతున్నారని ఆయన తెలిపారు. సైఫాబాద్‌లో నమోదైన కేసును విచారణ చేస్తుండగా.. ఈ గ్యాంగ్ వ్యవహారం అంతా బయటపడిందని సీపీ వెల్లడించారు. గత నాలుగు నెలలుగా వీళ్లు చోరీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఎక్కడ ఈ గ్యాంగ్ పట్టుబడలేదని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. 

అదేవిధంగా హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మీటింగ్ గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దక్షిణ, పశ్చిమ జోన్ ప్రజలతో ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ నిర్వహించామని అయన చెప్పారు. ఒక్కో చోట ఒక్కో సమస్య ప్రజలకు ఉందని.. కాబట్టి విజన్ 2020లో ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకారం అందించాలని సీసీ అంజనీకుమారు కోరారు. ప్రజల్లో వారి రక్షణ కోసం స్వతహాగా కొత్త విధానం ఏర్పడాలని సీపీ అంజనీ కుమార్ అన్నారు.

మరిన్ని వార్తలు