సిలిండర్‌ పేలి కుటుంబం దుర్మరణం

30 Dec, 2018 11:13 IST|Sakshi

సేలం: గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు.  ఈ ఘటన కొడైకెనాల్‌ కొండ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. దిండుకల్‌ జిల్లా కొడైకెనాల్‌ కీల్‌మలై ప్రాంతంలోని మంగళం కొంబు గ్రామానికి చెందిన రైతు గణేశన్‌ (51). ఇతని భార్య మంజుల (43). వీరి కుమార్తె విష్ణుప్రియ (9). గణేశన్‌ తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కుమార్తె విష్ణుప్రియ గ్రామానికి సమీపంలోని చిన్నాలంపట్టిలో ప్రైవేట్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. కుమార్తె చదువు నిమిత్తం గణేశన్‌ కుటుంబాన్ని ఇటీవల చిన్నాలంపట్టికి మార్చాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అప్పుడప్పుడూ మంగళం కొంబు గ్రామానికి వచ్చి వెళుతుంటాడు.

ప్రస్తుతం విష్ణుప్రియకు అర్ధ సంవత్సర పరీక్షల సెలవులు ఇవ్వడంతో భార్య బిడ్డలతో గణేశన్‌ సొంతూరికి వచ్చాడు. శుక్రవారం రాత్రి ఎప్పటిలానే ముగ్గురు భోజనం చేసి నిద్రించారు. శనివారం ఉదయం 6గంటల సమయంలో మంజుల మేల్కొని కాఫీ పెట్టడానికి గ్యాస్‌ స్టౌ వెలిగించింది. అకస్మాత్తుగా భారీ శబ్దంతో గ్యాస్‌ స్టౌ పేలింది. ప్రమాదంలో గణేశన్, మంజుల, విష్ణుప్రియ సజీవదహనమయ్యారు. శబ్దం విని ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. సమాచారంతో తాండికుడి పోలీసులు సంఘటన స్థలానకి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్‌ జీహెచ్‌కు తరలించారు. తాండికుడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ కారణంగానే పేలుడు సంభవించినట్టు తెలిసింది.

దంపతుల పంచ ప్రాణాలు కుమార్తె పైనే:
గణేశన్, మంజుల దంపతులకు వివాహమైన ఏళ్లయినా సంతా నం కలగలేదని, దేవుళ్లకు ఎన్నో మొక్కులు మొక్కగా వరంగా విష్ణుప్రియ పుట్టిందని గ్రామస్తు లు తెలిపారు. అప్పటి నుంచి కుమార్తెనే ఆ దంపతుల పంచ ప్రాణంగా చూసుకుంటున్నా రన్నారు.  కుమార్తె చదువు కోసం పుట్టి పెరిగి, జీవనం సాగిస్తున్న గ్రామాన్ని సైతం వదిలి వెళ్లడానికి గణేశన్‌ వెనుకాడలేదన్నారు.  విష్ణుప్రియ వెళదామంటేనే ఇప్పు డు గ్రామానికి వచ్చారని. తమతోనే కుమార్తెను కూడా తీసుకుపోవడం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. 

దంపతులు గణేశన్, మంజుల (ఫైల్‌)

ధ్వంసమైన ఇల్లు 

మరిన్ని వార్తలు