పుట్టినరోజే కానరాని లోకానికి..

16 Nov, 2023 09:38 IST|Sakshi

●రైలు ఢీకొని యువతి మృతి

తిరువళ్లూరు: పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బ్యూటీ పార్లర్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువతి మృతిచెందింది. తిరువళ్లూరు జిల్లా తిరువూర్‌ రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అన్బళగన్‌. కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమార్తె రేఖ(22) చైన్నె అన్నానగర్‌లోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం యథావిధిగా కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్లింది. అయితే మంగళవారం రేఖ జన్మదినం కావడంతో తల్లిదండ్రులు సాయంత్రం వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇంటికి త్వరగా వచ్చిన రేఖ ఇంట్లో పుస్తకాలను వుంచి బైక్‌లో సెవ్వాపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. అక్కడ బైక్‌ను పార్క్‌ చేసిన యువతి రైలు పట్టాలు దాటి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి సాయంత్రం ఆరుగంటలకు తిరిగి బయలుదేరింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాక్‌ దాటుతుండగా చైన్నె నుంచి తిరువళ్లూరు వైపు వెళుతున్న ఫాస్ట్‌ రైలు రేఖను ఢీకొంది. ఈ ప్రమాధంలో రేఖ అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వేపోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా పుట్టిన రోజే యువతి మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

మరిన్ని వార్తలు