తోటపల్లి కాలువలో మృతదేహం..

11 Aug, 2018 12:45 IST|Sakshi
 తోటపల్లి కాలువలో గుడ్డలు చుట్టి ఉన్న మృతదేహం 

బెడ్‌షీట్లు, గుడ్డలతో కట్టి తోటపల్లి కాలువలో పడేసిన వైనం

ఎక్కడో చంపి తెచ్చి పడేసి ఉంటారని స్థానికుల అనుమానం

చీపురుపల్లిరూరల్‌ : తోటపల్లి కాలువలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. మండలంలోని నాగంపేట, పుర్రేయవలస గ్రామాల మధ్యనున్న రావివలస రెవెన్యూ పరిధిలో గల తోటపల్లి కుడి ప్రధాన కాలువలో శుక్రవారం కనిపించిన గుర్తు తెలియని మృతదేహం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... పుర్రేయవలస గ్రామానికి చెందిన ఒక పాడిరైతు కాలువకు సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవును మెపుతూ కాలువలో ఉన్న మృతదేహాన్ని గమనించాడు.

వెంటనే ఈ విషయాన్ని స్థానిక నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చీపురుపల్లి సీఐ శ్యామలరావు, ఎస్సై కాంతికుమార్‌తో పాటు గరివిడి ఎస్సై శ్రీనివాసరావు, తోటపల్లి ప్రాజెక్ట్‌ ఏఈ నందీశ్వరరావు, రావివలస వీఆర్‌ఒ వెంకటరమణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాలువలో ఉన్న మృతదేహం పూర్తిగా బెడ్‌షీట్లు, గుడ్డలతో కప్పబడి పాదాలు మాత్రమే బయటకు కనిపించి ఉండటంతో మృతదేహం ఆడ, మగ అనేది పోల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో కాలువలోంచి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత మృతదేహం మగవాడిదిగా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. కాలువలో నుంచి తీసిన మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఎక్కడో చంపేసి ఉంటారు..

ఎక్కడో చంపి ఇక్కడ కాలువలో మృతదేహాన్ని పడేసి ఉండొచ్చనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహానికి గుడ్డలు చుట్టి ఉండడం,  దుర్వాసన రావడం.. గుర్తు పట్టలేనివిధంగా ఉండడంతో హత్య నాలుగు రోజుల కిందటే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.  ఇదిలా ఉంటే ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు