ఫేస్‌బుక్‌ అడ్డాగా దోపిడీ : నైజీరియన్‌ అరెస్ట్‌

5 Jun, 2019 10:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌ అడ్డాగా బాధితులకు రూ లక్షల్లో టోకరా వేస్తున్న నైజీరియాకు చెందిన ఆర్థర్‌ అకున్నెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలోని శివ్‌ విహార్‌ ప్రాంతంలో నివసించే ఆర్ధర్‌ తన సహచరులతో కలిసి ఫేస్‌బుక్‌ లక్ష్యంగా అమాయకులకు వల విసిరి పెద్దమొత్తంలో నగదును కాజేస్తాడని పోలీసులు తెలిపారు.

ఫేస్‌బుక్‌లో లక్ష్యంగా ఎంచుకున్న బాధితులకు విదేశాల నుంచి తాము విలువైన కానుకలను మీ కోసం తీసుకొస్తున్నామని నమ్మబలుకుతూ కస్టమ్స్‌ చెకింగ్‌లో ఇరుక్కుపోయామని తమ ఖాతాలకు నగదు పంపితే విలువైన కానుకలు మీకు ఇస్తామని వీరు ఎర వేస్తారని పోలీసులు తెలిపారు.

వీరి ఉచ్చులో కూరుకుపోయిన వారు పెద్దమొత్తంలో నగదును వారి ఖాతాల్లో జమ చేసి మోసపోతున్నారని చెప్పారు. కాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తనను రూ 30 లక్షల మేర మోసగించాడని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఆర్ధర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆర్ధర్‌కు సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు