రేప్‌ చేసి రూ.5 లక్షలిచ్చారు

17 Apr, 2018 12:47 IST|Sakshi
ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : తనను రేప్‌ చేసిన ఇద్దరు నిందితులు తన తల్లిదండ్రుల చేతిలో రూ.5 లక్షలు పెట్టి కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని కోరారని, అలాగే తన తల్లిదండ్రులు కూడా ఆ డబ్బులు తీసుకుని వాళ్లకే వత్తాసు పలికారని రేప్‌ కేసులో బాధితురాలు(16)  పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది.  ఢిల్లీలోని అమన్‌ విహార్‌ ఏరియాలో గత సంవత్సరం ఆగస్టులో ఇద్దరు వ్యక్తులు 16 ఏళ్ల బాలికను రేప్‌ చేశారు. ఈ కేసు విషయమై అప్పట్లో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బాలిక ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు బాలిక తల్లిని అరెస్ట్‌ చేసి అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిందితుల నుంచి డబ్బు తీసుకున్న తల్లిదండ్రులు కోర్టులో నిందితులకు అనుకూలంగా చెప్పాలంటూ బాలికను ఒప్పించేందుకు ప్రయత్నించారు.  అయితే అందుకు ఆమె తిరస్కరించడంతో బాలికపై తల్లిదండ్రులు చేయి చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆగస్టులో 16 ఏళ్ల బాలిక అదృశ్యమవడంతో తల్లిదండ్రులు కేసు పెట్టారు. వారం తర్వాత ఆ కీచకుల బారినుంచి బయటపడిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇద్దరు వ్యక్తులు బంధించి వారం రోజుల పాటు రేప్‌ చేశారని పోలీసులకు తెలపడంతో నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది.

రాజధానిలో ప్రతి రోజూ ఐదు అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని, 96.63 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వాళ్లే అవుతున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 38.99 శాతం కేసుల్లో స్నేహితులు, కుటుంబ సన్నిహితులే రేప్‌లకు పాల్పడుతున్నారని, 19.08 శాతం కేసుల్లో ఇరుగుపొరుగు వారు నిందితులుగా ఉంటున్నారని, 14.02 శాతం కేసుల్లో బంధువులే అత్యాచారాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. 3.86 శాతం కేసుల్లో తోటి ఉద్యోగులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు