ఎంజీఎంలో జూనియర్‌ డాక్టర్‌ వీరంగం

26 Jun, 2018 14:59 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో వైద్యురాలిపై ఫిర్యాదు చేసిన రోగి బంధుమిత్రులు 

బాటిళ్లు విసిరేస్తూ మండిపాటు

భయంతో పారిపోయిన రోగి

ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరి ఫోన్‌ను లాక్కున్న వైనం

వైద్యురాలిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రోగి బంధువులు

ఎంజీఎం : వరంగల్‌ మహాత్మాగాంధీ మోమోరియల్‌ ఆస్పత్రిలో పరిపాలనాధికారుల కొరత.. పట్టింపు లేని తనంతో పాలన రోజురోజు దిగజారుతుంది. రోగులు తమ సమస్యల ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. ఏకంగా  ఓ జూనియర్‌ వైద్యురాలు రోగి బంధువుపై మండిపడుతూ నేను వైద్యం అందించనూ... ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో అని  అక్కడ ఉన్న బాటిల్‌ను విసిరేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అంతటితో ఆగక మీపైన ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరించడంతో సదురు రోగి భయపడి ఆస్పత్రి నుంచి పారిపోయిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.  ఆ  ఆ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరి ఫోన్‌ను లాక్కుని జూనియర్‌ వైద్యులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.. చివరకు ఈ ఘటన సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో విషయం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు రోగుల బంధుమిత్రులకు అండగా నిలిచి మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ వైద్యురాలిపై ఫిర్యాదు చేశారు.

వీరంగం ఇలా..

వరంగల్‌ లేబర్‌ కాలనీ చెందిన నమిండ్ల సాగర్‌  క్రిమిసంహారక మందు తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 22న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిటైన సాగర్‌ మొదట ఏఎంసీలో చికిత్స అందించిన వైద్యులు అనంతరం ఆరోగ్యశ్రీ వార్డుకు తరలించారు.  క్రిమిసంహారక మందు తాగిన సమయంలో రోగి మానసిక పరిస్థితి సక్రమంగా ఉండని పక్షంలో రోగి వద్ద వారి బంధుమిత్రులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రోగి వద్ద బంధుమిత్రులు ఉండడాన్ని సహించని వైద్యురాలు వారిపై దురుసుగా ప్రవర్తించడంతో వైద్యురాలికి, బంధుమిత్రుల మధ్య వివాదం నెలకొంది.   ఎంజీఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న మహిళ రోగికి బంధుమిత్రులు కావడంతో ఆమె వైద్యురాలిని ప్రశ్నించింది.ఈ  క్రమంలో వివాదం మరింత ముదిరింది. నీ ఫై ఫిర్యాదు చేస్తా.. నాకు  హక్కు ఉందంటూ  వైద్యురాలు ఊగిపోతూ నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అని స్వీపర్‌పై ఎంజీఎం పరిపాలనాధికారులకు ఫిర్యాదు చేసింది. అంతటి ఆగకుండా మీపై కూడా కేసులు పెడుతామని రోగి బంధుమిత్రులను  భయబ్రాంతులకు గురిచేసింది.

పారిపోయిన రోగి..

వైద్యం అందించే విషయంలో జూనియర్‌ వైద్యురాలికి, రోగి బంధుమిత్రులకు జరుగుతన్న విషయాన్ని గమనించిన సదరు రోగి భయబ్రాంతులకు గురయ్యాడు. తనకున్న సమస్యలతో సతమతమవుతుంటే.. మరో సారి వైద్యురాలు తమపై కేసు పెడతాననడంతో  సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాత్‌రూమ్‌ వెళ్ళివస్తానని చెప్పి కనబడకుండా పారిపోయాడు . ఈ ఘటనతో రోగి బంధుమిత్రులు ఒక్కసారిగా మానసిక వేదను గురై రోదిస్తూ మట్టెవాడ పోలీసులను ఆశ్రయించారు. 

విలేకరి ఫోన్‌ లాక్కున్న  వైద్యులు..

తమపై ఎంజీఎంలోని వైద్యులు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారనే సమాచారం మేరకు ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు అక్కడికి వెళ్లి జరిగిన ఘటనపై రోగి బంధ«మిత్రుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న  జూనియర్‌ వైద్యులు అక్కడికి చేరుకుని మీరు ఎంజీఎం ఆస్పత్రిలో మా ఘటనలను ఏలా చిత్రీకరిస్తున్నావు అంటూ దౌర్జన్యానికి దిగుతూ విలేకరి ఫోన్‌ను లాక్కున్నారు. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు, రోగిబంధుమిత్రులు జూనియర్‌ డాక్టర్ల తీరుపై మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మట్టెవాడ పోలీసుల సమక్షంలో ఫోన్‌ లాక్కోవడం తప్పేనని ఒప్పుకుంటూ ఫోన్‌ను అప్పగించారు.

జూనియర్‌ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

ఎంజీఎం ఆస్పత్రిలో నమిండ్ల సాగర్‌పై దురుసుగా ప్రవర్తించిన జూనియర్‌ డాక్టర్‌పై చట్టపరమైన చర్య తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్‌ సంఘం నాయకులు జన్ను భాస్కర్, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్, ఎమ్మార్పీఎస్‌ తూర్పు ఇంచార్జీ ఈర్లకుమార్‌ మాదిగలు డిమాండ్‌ చేశారు.

వైద్యం అందించాలన్నందుకు ఉద్యోగం తీసేశారు...

మా అల్లుడు సరైన వైద్యం అందించాలని వైద్యురాలిని అడిగినందుకు నాపై మండిపడడంతో పాటు నా ఉద్యోగం తీసేశారని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వీపర్‌ రజిత రోదిస్తూ పేర్కొంది. రెక్కాడితే కాని డొక్కడాని తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు  వైద్యురాలు తమపై పరిపాలనాధికారులు ఫిర్యాదు చేసిందన్నారు.దీంతో ఎంజీఎం కాంట్రాక్టర్‌ ఖాజా తనను విధులకు రావొద్దంటూ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.  తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పారిపోయిన తన అల్లుడిని తమ వద్దకు చేర్చాలని పోలీసులను వేడుకుంది.  –రజిత, ఆస్పత్రి స్వీపర్‌మట్టెవాడ

మరిన్ని వార్తలు