అసలే దొంగ బాబా.. ఆపై హత్యాయత్నం

12 Apr, 2018 06:54 IST|Sakshi
మాట్లాడుతున్న రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి

బురిడీ బాబా సుధాకర్‌ అరెస్ట్‌

రూ.28 లక్షల నగదు స్వాధీనం   

నెల్లూరు(వేదాయపాళెం): మంత్ర పీఠికల పేరిట భక్తులను మోసం చేసిన అనంతబొట్ల సుధాకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ మహరాజ్‌ను ఎట్టకేలకు నెల్లూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి వివరాలను వెల్లడించారు. నగరంలోని మైపాడుగేట్‌ ప్రశాంతినగర్‌ వద్ద సుధాకర్‌ ఆశ్రమం ఉంది. ఇందులో 108 రోజుల పాటు యాగం నిర్వహించ తలపెట్టాడు. మంత్ర పీఠికలు కోసం భక్తుల నుంచి నగదు డిపాజిట్లు తీసుకున్నాడు. సుమారు రూ.10 కోట్ల వసూలు చేయగా అందులో కొంత మొత్తాన్ని పలువురికి డిపాజిట్‌ సొమ్ము కన్నా అదనంగా చెల్లించాడు.

సుధాకర్‌కు ఆశ్రమంలోని నాగవాసవి, మరికొందరు సహకరించారు. సుధాకర్‌ మోసం బయటపడటంతో ఆశ్రమంలోనే పురుగు మందు తాగి హైడ్రామా ఆడి సింహపురి ఆస్పత్రిలో చేరాడు. బుధవారం ఆస్పత్రి నుంచి డిచార్జి అవుతున్న విషయం తెలుసుకుని నెల్లూరు రూరల్‌ సీఐ పి.శ్రీనివాసరెడ్డి సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. మోసానికి పాల్పడిన వ్యక్తుల నుంచి ఆస్తుల రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు