కర్నూలులో ‘శంకర్‌దాదా’

19 Aug, 2018 03:13 IST|Sakshi
ఆర్‌ఎంపీ వేణుగోపాల్‌శెట్టి నుంచి వివరాలు సేకరిస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

     ఇంట్లోనే స్కానింగ్‌ సెంటర్‌

     పదో తరగతి చదివి గర్భనిర్ధారణ పరీక్షలు, అబార్షన్‌లు  

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు నగరంలో నకిలీ వైద్యుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో తరహాలో అర్హత లేకున్నా ఆస్పత్రి, స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న వ్యక్తిని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పట్టుకున్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న వై.వేణుగోపాల్‌శెట్టి ఇంట్లోనే స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఇతను చదివింది పదో తరగతి మాత్రమే. కానీ స్థానిక బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్‌ హాస్పిటల్, మెడికల్‌ షాపుతో పాటు ప్రకాష్‌నగర్‌లోని తన ఇంట్లో స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని పలువురు ఆర్‌ఎంపీలు ఇతని వద్దకు గర్భిణులను తీసుకొచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆర్‌ఈవో బాబురావు తన సిబ్బందితో వేణుగోపాల్‌శెట్టి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఆయన మారువేషంలో వెళ్లి.. స్కానింగ్‌ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వెంట డీసీటీవో వెంకటరమణ, సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐ జయన్న, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, శివరాముడు ఉన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జేవీవీఆర్‌కే ప్రసాద్‌ సమక్షంలో స్కానింగ్‌ మిషన్‌ సీజ్‌ చేశారు. వేణుగోపాల్‌శెట్టి వద్ద పాత స్కానింగ్‌ మిషన్‌తో పాటు గ్లౌజులు, అబార్షన్‌కు అవసరమైన ఆపరేషన్‌ థియేటర్‌ పరికరాలు లభించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు