పండగ పూట విషాదం

15 Jan, 2019 12:47 IST|Sakshi
ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందిన వీరనాగప్ప నాయుడు

సంక్రాంతి పండగ రోజున విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. కురబలకోటలో రైతు, బంగారుపాళెంలో మోటార్‌ సైక్లిస్టు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

చిత్తూరు, కురబలకోట : రోడ్డు ప్రమాదంలో ఓ రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లు సమీపంలోని మల్లేల గడ్డ వద్ద సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య కథనం...మండలంలోని శివరామపురానికి చెందిన వై.వీరనాగప్ప నాయుడు (64) వ్యవసాయం చేసుకుంటూ చీటీలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇతను సోమవారం ఉదయం టీవీఎస్‌పై ఇంటి నుంచి మదనపల్లెకు వ్యక్తిగత పనిపై బయలుదేరాడు. మార్గమధ్యంలో ముదివేడు మోడల్‌ స్కూల్‌ వద్ద బుడతనరాళ్ల దళితవాడకు చెందిన ఉంటా రామకృష్ణ (33) బస్సు కోసం వేచి ఉండగా అతనికి లిఫ్ట్‌ ఇచ్చాడు.

అంగళ్లు దాటుకుని మల్లేల గడ్డ వద్ద ముందు వెళుతున్న బండిని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మదనపల్లె–1 డిపోకు చెందిన కదిరి ఆర్టీసీ బస్సు కిందకు టీవీఎస్‌ వాహనం దూసుకుపోయింది. తీవ్రగాయాలకు గురై వీరనాగప్పనాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చుని ఉన్న రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్‌ సర్కిల్‌ సీఐ మురళీకృష్ణ, ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు వీరనాగప్ప నాయుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ వై.శివరామప్పనాయుడికి సోదరుడు. ఇతని మృతితో గ్రామంలో సంక్రాంతి కళ తప్పింది. విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్రాక్టర్‌ ఢీకొని మోటార్‌ సైక్లిస్ట్‌ మృతి– మరో ఇద్దరికి గాయాలు
బంగారుపాళెం: ట్రాక్టర్‌ ఢీకొని మోటార్‌ సైక్లిస్టు మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. సోమవారం ఈ ప్రమాదం మండలంలోని గుండ్లకట్టమంచి వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం..మండలంలోని మడుపోలూరుకు చెందిన గాంధీ(25), అరుణ్‌కుమార్‌(23), అజిత్‌కుమార్‌(22) స్వంత పని నిమిత్తం మోటార్‌ సైకిల్‌లో చిత్తూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మార్గమధ్యంలో గుండ్లకట్టమంచి వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వీరిని ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో గాంధీ అక్కడికక్కడే మృతి చెందాడు. అరుణ్‌కుమార్, అజిత్‌కుమార్‌కు కాళ్లు విరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. గాంధీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు