ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారులు

23 Oct, 2019 08:19 IST|Sakshi
వివరాలు తెలుపుతున్న ఏసీబీ డీఎస్పీ , ఏసీబీకి చిక్కిన సెక్షన్‌ అధికారి పవనసుతరాజు, బీట్‌ అధికారి వసీం, పట్టుకున్న నగదు

లంచం తీసుకుంటుండగా పట్టివేత

రూ.6 వేలు నగదు స్వాధీనం

రేచపల్లి సెక్షన్‌ అధికారి, బీట్‌ అధికారి అరెస్ట్‌

సాక్షి, జగిత్యాల : పాత ఇంటి కర్రకు అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేసిన అటవీశాఖ అధికారులు మంగళవారం నగదు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. అటవీశాఖ సెక్షన్‌ అధికారి, బీట్‌ అధికారుల లంచావతారం ఎట్టకేలకు బట్టబయలైంది. వివరాలు ఇలా..సారంగాపూర్‌ మండలం మ్యాడారంతండా గ్రామానికి చెందిన భూక్య గంగాధర్‌ నాయక్‌ (52 ) గిరిజనుడు ఒంటిరిగా నివాసం ఉంటున్నాడు. 30 రోజుల ప్రణాళికలో కూలిపోయే దశలోని ఇంటిని తొలగించాలని అధికారులు ఆదేశించారు. గంగాధర్‌ తన తాత సుమారు 70 ఏళ్లక్రితం నిర్మించిన రెండు ఇళ్లను తొలగించడానికి నిర్ణయించుకున్నాడు. అందులోని విలువైన టేకు కలప భద్రపరుచుకున్నాడు. ఈ కలపతో కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

20 రోజులక్రితం అటవీశాఖ సెక్షన్‌ అధికారి పవనసుతరాజు, గ్రామ బీట్‌ అధికారి ఎండి. వసీంను కలిసి కొత్త ఇంటికి కలప వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరాడు. ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు ఇస్తేనే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. రోజులతరబడి తిరిగినా కాళ్లు కూడా పట్టుకున్నా కనికరించలేదు. డీఎఫ్‌వోను కలిసి పరిస్థితిని మొరపెట్టుకున్నాడు. ఆయన ఆదేశించినా సెక్షన్‌ అధికారి, బీట్‌ అధికారులు పట్టించుకోకపోగా లంచంకోసం వేధించారు. దీంతో విసిగిపోయిన గంగాధర్‌ ఈనెల11న ఏసీబీ అధికారులను కలిశాడు. పక్కా ప్లాన్‌తో మంగళవారం గ్రామానికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్లు వేణుగోపాల్, సంజీవ్‌కుమార్, రాముతోపాటు మరో 10 మంది సిబ్బంది మ్యాడరంతండా పరిధిలోని రేచపల్లి గ్రామంలోని అటవీశాఖ బీట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

అప్పటికే బాధితుడు గంగాధర్‌కు రూ.6 వేలు ఇచ్చి, అటవీశాఖ సెక్షన్‌ అధికారి పవనసుతరాజు, బీట్‌ అధికారి ఎండి.వసీమోద్దీన్‌  దగ్గరికి పంపించారు. బీట్‌అధికారి డబ్బు తీసుకోగా, సెక్షన్‌ అధికారి, బీట్‌ అధికారి ఇద్దరు కలిసి గంగాధర్‌తో మాట్లాడుతుండగా దాడి చేసి ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 

వేధిస్తే 1064 నంబర్‌కు ఫోన్‌ చేయండి
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా ప్రజలు ఏసీబీ 1064 నంబర్‌కు ఫోన్‌ చేయాలని డీఎస్పీ కోరారు. కాగా ఇద్దరు అధికారులు పట్టుబడడంతో రేచపల్లి గ్రామస్తులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేయడం విశేషం.  

మరిన్ని వార్తలు