శరణార్థిగా అమెరికాలోనే స్థిరపడవచ్చంటూ...

6 Nov, 2018 09:04 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

దాదాపు 50 మంది నుంచి లక్షల్లో వసూలు

ఇకోడర్‌ దేశం వెళ్లే ప్రయత్నంలో ఘరానా మోసగాడి అరెస్టు

తండ్రీకుమారులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఇజ్రాయిల్‌...జోర్డాన్‌...ఇకోడర్‌ దేశాల్లో ఉద్యోగాలు, అమెరికా డాలర్లలో వేతనం. అవసరమైతే పనామా, మెక్సికో శరణార్థులుగా  అమెరికాకు వెళ్లి స్థిరపడి లక్షల్లో జీతాలు తీసుకోవచ్చునని’ దాదాపు 50 మంది నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి టోకరా ఘరానా మోసగాడిని నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కుమారుడు వోస సన్నీధర్‌ అలియాస్‌ సన్నీతో కలిసి దేశం విడిచివెళ్లేందుకు యత్నించిన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన వోస గంగాధర్‌ను బషీర్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 8.6 లక్షల నగదు, 3,100 యూఎస్‌ డాలర్లు, 11 పాస్‌పోర్టులు, ఇతర గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో   సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.

నిజామాబాద్‌కు చెందిన గంగాధర్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసి 1989లో షార్జాకు వెళ్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్యాబ్రికేటర్, గ్లాస్‌కట్టర్, మొబైల్‌ టెక్నీషియన్‌గా ఐదేళ్లు పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చాడు. వివాహం అనంతరం ఉద్యోగం నిమి త్తం దుబాయి, సౌదీఅరేబియా, సింగపూర్, ట్రినిడాడ్,  ఖతార్, బ్యాంకాక్, బెహ్రైన్, జోర్ధాన్, ఇం డోనేషియా దేశాలకు వెళ్లి వచ్చాడు.  సుమారు 30 దేశాల సరిహద్దులు, అక్కడికి ఎలా వెళ్లాలి, ఆయా దేశాల నుంచి మరో దేశానికి అక్రమ పద్ధతిలో వెళ్లి ఎలా స్థిరపడాలనే విషయాలపై పూర్తి పట్టు సా ధించాడు.  ఉద్యోగంతో పెద్దగా డబ్బులు సంపాదించాలేమనే నిర్ణయానికి వచ్చిన అతను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మహదేవ్‌పూర్‌కు మకాం మార్చాడు. విదేశాలకు వలసపోయే వారికి అవసరమయ్యే వీసా ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్‌ చేయించి ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే  గోలివడ్డ గంగాధర్, కస్తూరి ప్రకాస్‌ రాజ రామ్‌ పేర్లతోనూ చలమాణి అవుతూ ట్రావెల్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకుని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని మోసానికి తెరలేపాడు.  

అమెరికాలోనే స్థిరపడవచ్చంటూ...
ఇజ్రాయిల్, జోర్దాన్, ఇకోడర్‌ దేశాలకు పంపిస్తానంటూ   నిరుద్యోగులను నమ్మించి వారి పాస్‌పోర్టులు తీసుకున్నాడు. ఆమెరికాలో డాలర్లు వచ్చే పని కల్పిస్తానంటూ చెప్పిన అతను ఇందుకోసం వీసాలు ఇప్పిస్తానని దాదాపు 50 మంది నుంచి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల చొప్పున వసూలు చేశాడు. ఇకోడర్‌ నుంచి ఆమెరికాకు, పనామా దేశం, మెక్సికో దేశాల నుంచి శరణార్థిగా  వెళ్లవచ్చని నమ్మించాడు. ఆయా దేశాల మీదుగా ఆమెజాన్‌ అడవుల్లో కొంత దూరం నడిస్తే అమెరికా చెక్‌పోస్టులు తారసపడితే శరణార్ధిగా పేరు నమోదు చేసుకొని ఆమెరికాలోకి ప్రవేశించవచ్చునని ఆ తర్వాత ఆమెరికాలో ఎలా ఉద్యోగం సంపాదించాలో వివరించాడు. వీసా, డాక్యుమెంటేషన్‌ చేయించేందుకు ఢిల్లీలోని ఇజ్రాయిల్‌ ట్రావెల్స్‌ యజమాని పునీత్‌ సహాయం తీసుకున్నాడు. ఇలా 2015 నుంచి 50 మందిని మోసం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 2015లో ఇతడిపై నిజామాబాద్‌లో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, అర్మూర్‌లలోనూ కేసులు నమోదయ్యాయి.  

టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిందిలా...
అతని భారిన పడి మోసపోయినవారు గాలిస్తుండటంతో గంగాధర్‌ దేశం విడిచి వెళ్లాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా అబిడ్స్‌లోని వన్‌ లింక్‌ ట్రావెల్స్‌ నుంచి ఇకోడర్‌ దేశానికి వెళ్లేందుకు గంగాధర్, అతని కుమారుడు వోస సన్నీధర్‌ లియాస్‌ సన్నీలకు రెండు విమాన టిక్కెట్లు బుక్‌ చేశాడు. అక్కడి నుంచి శరణార్ధిగా ఆమెరికాకు వెళ్లి స్థిరపడి కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలని భావించాడు. సోమవారం రాత్రి దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైన తండ్రీ కుమారులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు బృందం అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించింది. మోసపూరిత ప్రకటనలను నమ్మి సామాన్యులు మోసపోవద్దని, ఇలాంటి వారి సమాచారాన్ని వెంటనే నగర పోలీసులకు తెలపాలని అంజనీకుమార్‌ తెలిపారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు